వైసీపీలో జగన్ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే.. నిండా ముంచేసిన తర్వాత తప్పు జరిగింది మళ్లీ నీ పాత ప్లేస్‌కు వెళ్లు అని తీరిగ్గా చెబుతూ ఉంటారు. ఎన్నికలకు ముందు. పార్టీ నేతలతో ఫుల్ బాల్ ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్లీ వారందరితో పాత నియోజకవర్గాలకు వెళ్లాలని చెబుతున్నారు. చిలుకలూరిపేట ఎమ్మెల్యేకు గుంటూరులో టిక్కెట్ ఇచ్చి..గుంటూరు మేయర్ కు చిలుకలూరిపేట టిక్కెట్ ఇచ్చేంత క్రియేటివిటీ పెట్టుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు మళ్లీ పాత స్థానాల్లోకి వెళ్లాలని వాళ్లకు చెబుతున్నారు.
విడదల రజనీ చిలుకలూరిపేటలో చేసిన అరాచకాలను తట్టుకోలేక ఆమెను గుంటూరుకు పంపారు. అక్కడ ఆమెకు రూ. యాభై కోట్లు వదిలిన తర్వాత.. యాభై వేల ఓట్ల తేడాతో పరాజయం మూటగట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ చిలుకలూరిపేట ఇంచార్జ్‌గా నియమించారు. గుంటూరులో అయితే గెలుపు అసాధ్యమని.. మళ్లీ చిలుకలూరిపేటకు పంపితే అక్కడ చేసేదేదో చేసుకుంటానని ఆమె జగన్ కు చెప్పుకున్నారు. చిలుకలూరిపేటలో కూడా ఎవరూ లేకపోవడం.. పార్టీనే నమ్ముకున్న మర్రి రాజశేఖర్ ను జగన్ నమ్మే చాన్స్ లేకపోవడంతో విడదల రజనీని పంపేశారు.
తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మేకతోటి సుచరితను కూడా తప్పించారు. గుంటూరు డిప్యూటీ మేయర్ ను అక్కడ ఇంచార్జ్ గా నియమించారు. సుచరిత ఇక తాను జగన్ నాయకత్వంలో ఎలాంటి రాజకీయాలు చేయలేనని దండం పెట్టేసినట్లుగా చెబుతున్నారు. గట్టిగా నమ్ముకుని పని చేసినా.. చివరికి ఎక్కడకు పొమ్మంటారో తెలియదని ఇలాంటి అనిశ్చితి రాజకీయాలు చేయలేనని తేల్చేసినట్లుగా చెబుతున్నారు.