స్టోర్ క్రషర్ యజమానిని బెదిరించి రెండుకోట్లకుపైగా వసూలు చేసిన కేసులో ఏసీబీ కేసు నమోదు చేయడంతో విడదల రజనీ ఫీలవుతున్నారు. తాను ఏం చేశానని విజిలెన్స్‌తో విచారణ చేయించాలని.. రెడ్ బుక్‌లో పేరు నమోదు చేసుకుని ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో మీడియాతో మాట్లాడారు. తనపై అక్రమ కేసుల వెనుక లావు కృష్ణదేవరాయులు ఉన్నారని ఆరోపించారు.
వైసీపీలో ఉన్నప్పటి నుంచి తనపై కృష్ణదేవరాయులకు కోపం ఉందన్నారు. ఓ మహిళా ఎమ్మెల్యే కాల్ లిస్టు కోసం తనను అడిగారని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఈ విషయం బయటకు చెప్పలేదన్నారు. మహిళా ఎమ్మెల్యే కాల్ లిస్టు కోసం విడుదల రజనీని కృష్ణదేవరాయులు ఎందుకు అడుగుతారో కానీ.. ఆమె హోంమంత్రిగా చేయలేదు. హోంమంత్రి కూడా అప్పట్లో గుంటూరు జిల్లాకు చెందిన వారే ఉన్నారు. మరి విడదల రజనీనే ఎందుకు అడిగారో ఆమె చెప్పలేదు.
గతంలో కేసుల ప్రస్తావన వచ్చిన ప్రెస్ మీట్ పెట్టి ప్రత్తిపాటి పుల్లారావుపైన ఆరోపణలు చేశారు. సవాల్ చేశారు. తేల్చుకుందామన్నారు. చాలా మాటలన్నారు. ఇప్పుడు ఆమె హఠాత్తుగా కృష్ణదేవరాయులుపై గురి పెట్టారు. వైసీపీలో ఉన్నప్పుడు కృష్ణదేవరాయులుకు, విడదల రజనీకి విబేధాలు ఉన్నాయి. ఆయన పార్టీ మారిపోవడానికి విడదల రజని కూడా ఓ కారణం అని చెబుతారు. పార్టీ హైకమాండ్ పెద్దల వద్ద రజనీకే ఎక్కువ పలుకుబడి ఉండటంతో కృష్ణదేవరాయులుకు అవమానాలు తప్పలేదు. అందుకే ఆయన టీడీపీలో చేరారు.