గవర్నర్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు తెలిసినవే. సభలో మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ పై దాడి, గందరగోళం సృష్టించడానికి కారణమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను సభ నుంచి బహిష్కరించారు. దీన్ని సవాలు చేస్తూ ఆ ఇద్దరు నేతలూ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. సభలో జరిగిన గందరగోళానికి సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజ్ ను సమర్పిస్తామంటూ హామీ ఇచ్చిన అడ్వొకేట్ జనరల్ రాజీనామా చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగినట్టయింది.
మంగళవారం ఉదయాన్నే కేసు విచారణకు చేపట్టగా, ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు అడ్వొకేట్ జనరల్, అదనపు అడ్వొకేట్ జనరల్ కూడా హాజరు కాకపోవడంతో విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. అయితే, మధ్యాహ్నానికి తాను న్యాయ శాఖ తరఫున హాజరు అవుతున్నాననంటూ ఏఏజీ రామచంద్రరావు వచ్చారు. తరువాత, వీడియో ఫుటేజ్ ను కోర్టుకు సమర్పిస్తున్నారా అని ఏఏజీని న్యాయమూర్తి అడిగారు. వీడియో ఫుటేజ్ ఇవ్వాల్సింది అసెంబ్లీ అనీ, అది కూడా సభ తీర్మానం చేసిన తరువాతే ఫుటేజ్ ఇస్తారనీ, అలాంటి తీర్మానమేదీ సభ చేసినట్టుగా లేదని ఏఏజీ అన్నారు. అయితే, అదే విషయాన్ని మెమొ దాఖలు చేయాలని న్యాయమూర్తి కోరితే… ఆ పని తాను చేయలేననీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాలని మాత్రమే తనకు సూచనలు వచ్చాయనీ, ఈ విషయంలో న్యాయశాఖ నామమాత్రపు ప్రతివాది మాత్రమేననీ, తాను అసెంబ్లీ తరఫున రాలేదని ఏఏజీ చెప్పారు. అంతేకాదు, కౌంటర్ దాఖలు చేయడానికి మరో నెల గడువు కోరితే, ఇప్పటికే ఇచ్చిన గడువు చాలనీ, ఏప్రిల్ 3 లోగా దాఖలు చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
వీడియో ఫుటేజీని కోర్టుకు సమర్పించకపోతే, అందులోని అంశాలు వ్యతిరేకంగా ఉన్నట్టు పరిగణిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం విశేషం. ఏప్రిల్ 3న ఈ కేసుపై విచారణ ఉంటుంది. ఈలోగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.