షర్మిల తెలంగాణ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయత్తం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కెటిఆర్ ఎవరో తనకు తెలియదు అని ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..
షర్మిల పార్టీ పెట్టిన నాటి నుండి కెసిఆర్ పాలన పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంది. తాజాగా ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని ప్రకటించింది. చెప్పిన మాట మేరకు గత మంగళవారం దీక్ష చేసింది కూడా. అయితే దీనిపై స్పందించిన కేటీఆర్, ఏదో వ్రతం చేసినట్లుగా అప్పుడప్పుడు వచ్చి దీక్షలు చేసే వారి వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదని, తెలంగాణ ప్రజల బాగోగులు చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిమని షర్మిల ను విలేకరులు కోరినప్పుడు ఆవిడ కేటీఆర్ అంటే ఎవరు అని వెటకారంగా ప్రశ్నించారు. కేటీఆర్ అంటే ఎవరో తనకు తెలియదని ముందు మాట్లాడి, పక్కన వాళ్ళు కెసిఆర్ వాళ్ళ అబ్బాయే కేటీఆర్ అని చెబితే, ఓహో అవునా కెసిఆర్ వాళ్ళ అబ్బాయి కేటీఆరా అంటూ వ్యంగ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు.
అయితే సోషల్ మీడియా లో షర్మిల వ్యాఖ్యలపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. షర్మిల గతంలో కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన పాజిటివ్ వ్యాఖ్యల వీడియోలను పోస్ట్ చేసి మరీ షర్మిలను ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు. గతంలో షర్మిల, లోకేష్ ని కించపరచడానికి కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు. ఆవిడ అప్పట్లో మాట్లాడుతూ, తెలంగాణలో కెసిఆర్ తన కుమారుడు కేటీఆర్ ని మంత్రి గా చేయడం చూసి చంద్రబాబు కూడా లోకేష్ ని మంత్రి చేశాడని, కానీ కేటీఆర్ తెలంగాణలో ఎన్నో పరిశ్రమలు తీసుకొని వచ్చి యువతకు ఉపాధి కల్పిస్తే , లోకేష్ మాత్రం ఏమీ చేయలేకపోయాడు అని అప్పట్లో షర్మిల లోకేష్ ని విమర్శించడానికి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు.
ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. అప్పట్లో అంతగా కేటీఆర్ ని ఆకాశానికి ఎత్తేసిన షర్మిల ఇప్పుడు కేటీఆర్ ఎవరో తనకు తెలియదు అన్నట్టుగా మాట్లాడటం హాస్యాస్పదం అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. మొత్తం మీద తన అసంబద్ధ వ్యాఖ్యలతో షర్మిల సోషల్ మీడియాలో తరచుగా ట్రోల్ అవుతున్నారు.