స్వాములు సర్వసంగ పరిత్యాగులు. వారు ధనం నుంచి అధికారం వరకు దేనిపైనా ఆసక్తి చూపరు. అలా అయితేనే స్వాములంటారు. కానీ ఇప్పుడేం జరుగుతోంది. అధికారంలో ఉన్న వారిని.. రాజకీయ నేతలను మచ్చిక చేసుకోవడానికే పీఠాలు పెట్టేస్తున్నారు. అడ్డగోలుగా భూదందాలు చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఇలా తెరపైకి వస్తున్నారు. ఈ స్వాములు ధర్మ పరిరక్షణ చేయకుండా రాజకీయ నేతలతో ఎందుకు అంటకాగుతున్నారు.
తెలంగాణలో కేసీఆర్తో అంటకాగిన చినజీయర్ స్వామి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలంగాణలో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి మైహోమ్ రామేశ్వరరావుకు మరీ ఆత్మీయుడు. ఆయన అధ్యాత్మతికం అంతా ఇలా రాజకీయ నేతలు, బడా వ్యాపారుల చుట్టే తిరుగుతుంది. ఇక విశాఖ స్వరూపానంద శారదాపీఠం అని పెట్టుకుని చేసిన వ్యవహారాల సంగతి చెప్పాల్సిన పని లేదు. అసలు ఆయనది అసలైన శారదాపీఠం కాదు..శృంగేరి శారదాపీఠానికి ఆయనకు సంబంధం లేదు. అయినా చేయాల్సింది చేశారు.
రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు శాశ్వతంగా సీఎంలుగా ఉంటారని..తానే తపస్సు చేశానని నమ్మించి కోకాపేటలో రెండు ఎకరాలు, విశాఖలో రూ.300 కోట్ల స్థలం, తిరుమలలో స్థలం ఇలా లెక్కలేనంత కొట్టేశారు. స్వామిజీలకు ఇవన్నీ ఎందుకు ?. కొత్తగా విశాఖలో విధుశేఖర స్వామిని జగన్ దర్శించుకున్నారు. గంటన్నర సేపు మంతనాలు జరిపారు. ఎందుకంత రాజకీయం చేయాల్సిన అవసరం. ఇలా జగన్ మాట్లాడారో లేదో ఆ స్వామి పేరుతో ఫుల్ పేజీ ప్రకటనలు వచ్చాయి. గుంటూరులో విజయయాత్రకు వెళ్తున్నారట.
స్వామిజీల వల్ల సమాజం ఆశించే ఉపయోగం వేరు. మంచి మాటలు చెబుతారని. .. మనుషుల్లో చెడు ప్రవర్తన లేకుండా చేస్తారని.. కుళ్లు, కల్మషాల నుంచి ప్రజలకు విముక్తి కలిగేలా ప్రవచనాలు చెబుతారని ఆశిస్తారు. కానీ వీరు ఎక్కువగా దైవాంశ సంభూతుల పేరుతో రాచమర్యాదలు పొందుతారు కానీ.. సమాజానికి చేసే మేలు ఎంత అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఆ విషయంలో చాగంటి వారు చేసిన మేలు ఇప్పటి వరకు ఏ స్వామీ చేయలేదు.