మాజీ మంత్రి విడదల రజని మరిది విడదల గోపిని పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. కొంత కాలంగా ఆయన పరారీలో ఉన్నారు. ఆయన జర్మనీ పౌరుడు అని ఆయనపై కేసులు పెడుతున్నారని విడదల రజని గతంలో చెప్పుకొచ్చారు. వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి ఆయన ఆజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు.
విడదల రజనీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో మొత్తం దందాలు ఆయనే నడిపారు. స్టోర్ క్రషర్ యజమానుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆయన బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లుగా అనేక ఫిర్యాదులు పోలీసులకు అందాయి. చిలుకలూరిపేట నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల పాటు ఆయన చేసిన అరాచకం గతంలో ఎవరూ చేయలేదన్న విమర్శలు నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చాయి.
విడదల రజనీతో కలసి డబ్బులు వసూలు చేయడాన్ని ఓ వ్యాపకంగా మార్చుకుని కోట్లు కూడబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ఓడిపోయిన తర్వాత కొంతమందికి తిరిగి డబ్బులిచ్చారు. కానీ ఇంకా ఎంతో మంది తమ డబ్బు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా మందిని ఇప్పటికీ బెదిరిస్తున్నారు. రాజకీయం వేధింపులు అని చెప్పుకుని కవర్ చేయడానికి విడదల రజని ప్రయత్నిస్తున్నారు కానీ.. ఆమెకూ అరెస్టు ముప్పు పొంచి ఉంది.