తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ వైఎస్ఆర్సీపీలో కీలకంగా మారారు. ఆమె సోషల్ మీడియాలో చాలా ఖర్చు పెట్టి ప్రచారం చేయించుకుంటూ ఉంటారు. అయితే ఆమె ఆ ప్రచారాలకే కాదు.. వైసీపీలో గాడ్ ఫాదర్ల అభిమానాన్ని కూడా పొందగలిగినట్లుగా తెలుస్తోంది. ఎంపీ కృష్ణదేవరాయులుతో విబేధాలు ఉన్నా.. పార్టీ హైకమాండ్ ఆమెకే మద్దతు పలుకుతూవస్తోంది . ఈ క్రమంలో గుంటూరు జిల్లా నుంచి బీసీ కోటాలో విడదల రజనీకి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.
నిజానికి గతంలో రాజ్యసభకు వెళ్తూ రాజీనామా చేసిన పిల్లి సుభాష్, మోపిదేవి స్థానాల్లో గుంటూరు నుంచి విడదల రజనీకి చాన్స్ వస్తుందని గట్టి ప్రచారం జరిగింది. అయితే ఆమె తొలి సారి ఎమ్మెల్యే అని అందుకే అవకాశం ఇవ్వలేదని వైసీపీ వర్గాలు చెప్పుకున్నాయి. అయితే అదే తొలి సారి ఎమ్మెల్యే అయిన అప్పల్రాజుకు అవకాశం కల్పించారు. ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరుణంలో మరోసారి విడదల రజనీ పేరు పరిశీలనలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె ఐటీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే ఐటీ మంత్రిగా సరిపోతారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో చేసేస్తున్నారు.
అయితే విడుదల రజనీ సోషల్ మీడియాలో ఇలా మంత్రి పదవులపై ప్రచారం చేయించుకుని వైసీపీ హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నుంచి ఎలాంటి సూచనలు లేకపోయినా ఆమె వర్గీయులు సోషల్ మీడియా ప్రచారాలతో ఇలా చేస్తున్నారని కొంత మంది గుర్రుగా ఉంటున్నారు. ఆమె తీరు వల్ల పార్టీలో కొంత మందికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. నిజానికి మంత్రి పదవి విషయంలో విడదల రజనీకి సిగ్నల్స్ వచ్చినా రాకపోయినా.. ఆమె చుట్టూ చర్చ మాత్రం వైసీపీలోనే కాదు.. ఏపీ రాజకీయాల్లో మాత్రం హాట్ హాట్ గా సాగుతూనే ఉంది.