నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘యన్.టి.ఆర్’. బాలకృష్ణ తండ్రి నందమూరి తారక రామారావు బయోపిక్ ఇది! ఇందులో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్న సంగతి తెలిందే. ఓసారి వారం రోజుల పాటు హైదరాబాద్లో కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. త్వరలో మళ్లీ రానున్నారు. అయితే… బసవతారకం పాత్రకు సంబంధించిన సమాచరం కొంతే వుందట! ఆ కాస్త సమాచారానికి ఊహను జోడించి విద్యా పాత్రను చిత్రీకరిస్తున్నార్ట. ఈ మాట అన్నది మరెవరో కాదు… విద్యా బాలనే. ముంబై మీడియాతో మాట్లాడిన విద్యా బాలన్ ‘‘ఎన్టీఆర్ భార్యగా తప్ప, బసవతారకంగారి గురించి పబ్లిక్కి పెద్దగా తెలియదు. ఆమె చాలా ప్రయివేట్ పర్సన్. ఎవరూ ఆమె గురించి మాట్లాడిన సందర్భాలు గానీ, ఆమె సమాచారాన్ని భద్రపరిచిన దాఖలాలు గానీ లేవు. నేను ఎన్టీఆర్ కుమార్తెలతో ఒకసారి మాట్లాడాను. ఇంట్లో ఆమె ఎలా వుండేవారనే సమాచారాన్ని కొంత చెప్పారు. అందువల్ల నా పాత్ర కుటుంబ సభ్యుల నుంచి లభించిన సమాచారం మేరకు కొంత… ఊహించి చిత్రీకరించిన్నది మరింత వుంటుంది’’ అని పేర్కొన్నారు. మొన్నామధ్య విద్యా బాలన్ హార్మోనియం నేర్చుకున్నారు కదా! అది ఎన్టీఆర్ బయోపిక్ కోసమే అట! కొన్ని సన్నివేశాల్లో హార్మోనియం ప్లే చేస్తూ కనిపిస్తానని విద్యా బాలన్ తెలిపారు.