హ్యాపీ న్యూఇయర్ వేడుకలతో పాటుగా తన జన్మదినోత్సవాన్ని గోప్యంగా ఎక్కడో విదేశాల్లో జరుపుకోవాలని తన భర్తతో బయలుదేరిన బాలీవుడ్ నటి విద్యా బాలన్ అనారోగ్యంతో ముంబయిలోని హిందుజా ఆస్పత్రిలో చేరాల్సివచ్చింది. ప్రాధమిక పరీక్షల ఆధారంగా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆమె వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు. విద్యా బాలన్ తన భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్ తో కలసి నూతన సంవత్సర వేడుకలను, తన జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం కోసం వేరే దేశం వెళ్ళేందుకు ముంబయ్ నుంచి బయలుదేరారు. అయితే ఆమెకు విపరీతంగా నడుం నొప్పి రావడం, విమానాశ్రయంలోనే చికిత్స పొందారు. ఈలోగా ఆమెకు జ్వరం కూడా రావడంతో వెంటనే ఖార్ హిందూజా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాధమిక పరీక్షల అనంతరం కిడ్నీలో రాళ్లు ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. ఆమె చికిత్సకు చురుగ్గానే స్పందిస్తున్నారనీ, త్వరలోనే కోలుకుంటారని ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి.
విద్యా బాలన్ 1978 జనవరి 1న జన్మించారు. బాలీవుడ్ లో అగ్రనటిగా ఎదిగారు. నేషనల్ ఫిల్మ్ అవార్డు సహా ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు. మహిళా హక్కుల కోసం ఆమె పోరాడుతున్నారు. 2014లో ఆమెకు ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసింది. ఆమె ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు.