‘ఎన్టీఆర్’ బయోపిక్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ఓ కొలిక్కి వస్తున్నాయి. ఒకొక్క పాత్రకూ సంబంధించిన నటీనటుల ఎంపిక పూర్తవుతోంది. చిత్రబృందాన్ని కాస్త టెన్షన్ పెట్టిన సంగతి.. బసవతారకం పాత్ర. ఎన్టీఆర్ భార్య బసవతారకంగా ఎవరు కనిపిస్తారు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ పాత్ర కోసం నిత్యమీనన్‌ని సంప్రదించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె నో చెప్పింది. ఇప్పుడు ఆ పాత్ర కోసం విద్యాబాలన్‌ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకం పాత్రకున్న పరిధి చిన్నదే. కానీ ప్రాధాన్యం మాత్రం చాలా ఉంది.
హైదరాబాద్‌లో బసవతారకం కాన్సర్ ఆసుపత్రి స్థాపన వెనుక… బసవతారకం ఆశలు, ఆశయాలూ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఓ సన్నివేశం కంటతడిపెట్టించేలా ఉంటుందని, ఆ సన్నివేశం పండాలంటే.. కచ్చితంగా భావోద్వేగాలు పండించగల నటీమణి అవసరం అని, అటు తేజ, ఇటు బాలయ్య భావించారు. అందుకే ఆ పాత్ర కోసం పేరున్న నటీమణుల్ని పరిశీలించారు. ఆ అవకాశం విద్యాబాలన్‌కి దక్కినట్టు తెలుస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి కోసం కూడా విద్యాబాలన్ ని సంప్రదించింది చిత్రబృందం. అప్పుడు ఈ కలయిక కుదర్లేదు. ఇప్పుడు మాత్రం వర్కవుట్ అయినట్టు సమాచారం. అయితే అధికారిక ప్రకటన రావాల్సివుంది.