అమ్మతనం ఓ వరం. పెళ్లయిన ఆడవాళ్లంతా ‘అమ్మ’ అనే పిలుపు కోసమే ఎదురుచూస్తుంటారు. తల్లయ్యానన్న వార్త పదిమందితో పంచుకోవాలని ఉవ్వీళ్లూరతారు. అయితే అందరూ ఇలానే ఉండాలన్న రూల్ లేదు. దీనికి విరుద్ధమైన భావాలున్న అమ్మాయిలూ ఉన్నారు. విద్యాబాలన్ ఆ కేటగిరీకే చెందుతుంది. త్వరలో విద్యాబాలన్ తల్లికాబోతోందన్న వార్త షికారు చేస్తోంది. ఈ నేపథ్యం విద్య కాస్త ఘాటుగా స్పందించింది. ఆసుపత్రికి వెళ్లి చెకప్‌లు చేయించుకొన్నానంటే.. అది గర్భం కోసమే అని ఎందుకు అనుకోవాలి?? అది తప్ప ఇంకే ఆలోచనలూ రావా?? పెళ్లయిన ఆడవాళ్లంతా తల్లులు అవ్వాల్సిందే అని రూలేమైనా ఉందా?? మేమేమైనా పిల్లల్ని కనే యంత్రాలమా?? అంటూ ఎవ్వరూ ఊహించని సమాధానాలు చెప్పి షాక్ ఇచ్చింది విద్య. ఇప్పటికే దేశంలో జనాభా పెరిగిపోయిందని, కొంతమందికి పిల్లలు లేకపోవడం వల్ల వచ్చిన నష్టమేం లేదని, పిల్లల్ని కనడం కనకపోవడం తమ ఇష్టమని, తమ వ్యక్తిగత విషయమని, ఇందులో మీడియా ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదని… ఏంటోంటే మాట్లాడేసింది విద్యాబాలన్.
సెలబ్రెటీలు, అందునా విద్యాబాలన్ లాంటి స్థాయి మహిళలు ‘అమ్మతనం’ గురించి ఈ రేంజులో క్లాసు పీకడం కొత్త విషయమే. ఇదేమాట కాస్త సుతి మెత్తగా… చెప్పాల్సింది. విద్య ఆవేశం చూస్తుంటే.. మీడియాపై తనకు పీకల్దాకా కోపం ఉందన్న విషయం అర్థమవుతోంది. అది ఎందుకు?? అనేదే తెలియడం లేదు. మొత్తానికి పిల్లలపై తన ఉద్దేశాన్ని బయటపెట్టడం ద్వారా విద్యాబాలన్ మరోసారి వార్తల్లో కి ఎక్కింది. ప్రస్తుతం విద్య కామెంట్సే.. టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీగా మారాయి.