తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన ‘విద్య వాసుల అహం’ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇది కొత్తగా పెళ్ళయిన ఓ జంట కథని ట్రైలర్ చూడగానే అర్ధమైయింది. మరీ పెళ్లి కథలో కొత్తదనం ఏమిటి? ఇగో కారణంగా కాపురంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నారు? ఇవన్నీ ప్రేక్షకులని అలరించేలా ఉన్నాయా?
రాహుల్ విజయ్ (వాసు) మెకానికల్ ఇంజనీర్. విద్య (శివాని రాజశేఖర్) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. విద్యకు తను చేసుకునే భర్త విషయంలో పెద్ద కోరిక చిట్టా వుంటుంది. ఏకంగా ఒక ప్రశ్నా పత్రమే తయారుచేసి, అందులో పాస్ అయిన వారినే పెళ్లి చూపులకి పిలుస్తుంది. ఈ టెస్ట్ లో వాసు పాస్ మార్కులు తెచ్చుకుంటాడు. వాసు ఇచ్చిన సమాధానాలు విద్యకు నచ్చుతాయి. పెళ్లి చూపులకు వచ్చిన వాసు మరింతగా నచ్చేస్తాడు. మూడు ముళ్ళ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు విద్య – వాసు. అయితే తొలిరాత్రికే వారి మధ్య ఇగో, పొసెసివ్ ఇష్యూలు తలెత్తుతాయి. తర్వాత ఈ జంట ప్రయాణం ఎలా సాగింది? అసలు ఇగో సమస్యలు రావడానికి కారణాలు ఏమిటి? చివరికి ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్నారా లేదా? అనేది తక్కిన కథ.
సినిమాకి ఒక కథ అనుకున్నపుడు అందులోని యూ.ఎస్.పి ఏమిటి? అనే ప్రశ్న సర్వసాధారణంగా వస్తుంది. కథగా అనుకున్న పాయింట్ లోనో, చెప్పే విధానంలోనో ఏదో ఒక కొత్తదనం ఉండాల్సిందే. అయితే విద్య వాసుల అహం చూస్తునపుడు యూ.ఎస్.పిని చెక్ చేసుకున్నట్లుగా అనిపించలేదు. పెళ్లి చుట్టూ ఇప్పటివరకూ వచ్చిన సినిమాలు, షార్ట్ ఫిల్మ్ లు, సోషల్ మీడియాలో కనిపించే మెసేజ్ వగైరా.. వగైరాలని ఆధారంగా చేసుకొని ఎలాంటి కొత్తదనం లేని ఓ పాత పెళ్లి కథనే తిప్పితిప్పి చూపించినట్లుగా అనిపించింది.
బాపు తీసిన క్లాసిక్ ‘మిస్టర్ పెళ్ళాం’ను గుర్తు చేస్తూ వైకుంఠంలో శ్రీ లక్ష్మీ నారాయణుల సంభాషణతో ఈ పెళ్లి కథ మొదలౌతోంది. విద్య, వాసుల పరిచయాలు, తనికెళ్ళ భరణి పెళ్లి ప్రవచనం రొటీన్ గా అనిపిస్తాయి. తన పెళ్లి విషయంలో విద్య రాసుకున్న లిస్ట్ మాత్రం కాసేపు నవ్వించేలా వుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఇదొక్కటే చెప్పుకోదగ్గ సీన్ లా వుంటుంది.
ఈ కథలో అసలు సంఘర్షణ పెళ్లి తర్వాత మొదలుకావాలి. ఇద్దరి ఇగో అనేది ప్రధాన సంఘర్షణ. కానీ ఇక్కడ అదే తేలిపోయింది. వారిద్దరి కెమిస్ట్రీలో సహజత్వం కొరవడింది. పైగా వారికి ఎదురయ్యే పరిస్థితులు ఆర్గానిక్ గా అనిపించలేదు. సన్నివేశాల్లో కొత్తదనం లేకపోగా కృత్రిమంగా తయారైయ్యాయి. సెకెండ్ హాఫ్ అంతా అక్కడక్కడే తిరిగుతున్న భావన కలిస్తుంది. క్లైమాక్స్ అయితే ఇంకా రొటీన్ గా వుంది. అదొక ప్రవచనంగా సాగుతుంది.
వాసుగా రాహుల్ విజయ్ మొదట్లో చలాకీగా కనిపిస్తాడు. తర్వాత ఆ పాత్ర డల్ అయిపోతుంది. సరైన సన్నివేశాలు లేకపోవడంతో ఆయన ఎక్స్ ప్రెషన్ కూడా ఒకటేలా తయారైయింది. విద్యగా శివాని హుషారుగా కనిపించింది. మొదట్లో ఆ పాత్రని బలంగా చూపించినప్పటికీ తర్వాత చెప్పుకోదగ్గ డ్రామా లేకపోవడంతో పెద్దగా నటించే అవకాశం రాలేదు. శ్రీమహావిష్ణుగా శ్రీనివాస్ అవసరాల గెటప్ పర్వలేదనిపిస్తుంది. శ్రీమహాలక్ష్మీ గా అభినయ సరిపోయింది. శ్రీనివాస్ రెడ్డి నారదునిగా కనిపించాడు. రవివర్మ, కాశీ విశ్వనాథ్ పరిధిమేర కనిపించారు. కల్యాణి మాలిక్ నేపధ్య సంగీతం బావుంది కానీ పాటలు రిజిస్టర్ కాలేదు. కొన్ని మాటలు గమ్మత్తుగా కుదిరాయి. పరిమిత బడ్జెట్ తో నిర్మించారనే సంగతి అర్ధమౌతుంటుంది.
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ తో పాటు తీసిన విధానంలో కూడా కొత్తదనం లేకుండా పోయింది. సర్దుకుపోవడం, ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడమే.. పెళ్లి. ఈ మెసేజ్ తో లెక్కలేనన్ని సినిమాలు వచ్చుంటాయి. విద్య వాసుల అహం కూడా లాంటి ఓ పాత కథే.