ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి బ్రదర్స్ భూకబ్జాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందటంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సీసీఎల్ఏను ఆదేశించింది.
వైసీపీ హయాంలో పిన్నెల్లి బ్రదర్స్ అడ్డూ, అదుపు లేకుండా భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు కూడా భయపడ్డారు. ఈ ఎన్నికల్లో పిన్నెల్లి ఓటమి పాలు కావడం..వైసీపీ అధికారం కోల్పోవడంతో పిన్నెల్లి పాపం పండినట్లు అయింది. దీంతో ఆయన బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
Also Read : తప్పడం లేదా..జగన్ కు పెద్దిరెడ్డి షాక్ ఇవ్వబోతున్నారా?
మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ నేతలు దాదాపు ఐదు వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క మాచర్ల మండలంలోనే 2 వేల ఎకరాలు, దుర్గి మండలంలో 5 వందల ఎకరాలు అన్యాయక్రాంతం అయ్యాయని అంటున్నారు. కారంపూడి మండలంలో శ్రీ సిమెంట్స్ 2 వేల ఎకరాలు కొనుగోలు చేయగా..ఈ భూముల్లో నిషేధిత భూములు అమ్ముకొని పిన్నెల్లి అనుచరులు భారీగా సొమ్ము చేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి.
మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని..నియోజకవర్గంలో విలువైన భూములు అనిపిస్తే చాలు కబ్జా చేశారని అంటున్నారు. దేవాదాయ భూములను కూడా వదల్లేదని చెబుతున్నారు. తాజాగా కూటమి సర్కార్ కు ఫిర్యాదులు అందటం..విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో.. విచారణ ప్రారంభమైతే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటకు వస్తాయని అంటున్నారు.