తిరుమల తిరుపతి దేవస్థానంలో పదేళ్ల పాటు జరిగిన అవినీతి వ్యవహారాలపై విజిలెన్స్ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలు దేవుడితో పాటు భక్తులు దోచుకున్న వైనాన్ని విజిలెన్స్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది. అన్ని ఆధారాలతో .. ప్రతి విభాగంలో జరిగిన దోపిడీ గురించి వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భక్తులను కూడా దోచుకున్న వైనాన్ని విజిలెన్స్ సాక్ష్యాలతో సహా బయట పెట్టింది. టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి నాలుగేళ్లలో లక్ష బ్రేక్ దర్శన్ టిక్కెట్లను అమ్ముకున్నారని విజిలెన్స్ తేల్చింది. ఆయన మాత్రమే కాదు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా దగ్గర నుంచి ఇలా బ్రేక్ దర్శనాల వీఐపీల గురించి చెప్పాల్సిన పని లేదు. వీరంతా ఆ బ్రేక్ దర్శనాల టిక్కెట్లు ఊరకనే ఇవ్వరు. కనీసం ఒక్కో టిక్కెట్‌కు పదివేల రూపాయలు వసూలు చేసి ఉంటారు . చాలా టిక్కెట్లు ట్రావెల్స్ కంపెనీల పేరుతో అమ్మేసుకున్నారు.
తిరుమలలో ప్రొక్యూర్ మెంట్ వ్యవహారం మొత్తం అతి పెద్ద స్కామ్‌లలో ఒకటిగా మారింది. సరుకుల కొనుగోలులో కమిషన్లు తీసుకుని అధిక ధరలు చెల్లించారు. నాణ్యమైన వస్తువులు సరఫరా చేయకపోయినా పట్టించుకోలేదు. కమిషన్లు కొట్టేసేందుకు ప్రత్యేకంగా ఇంజినీరింగ్ పనులకు టెండర్లు పిలిచారు. కొన్ని సత్రాలను కూడా కూల్చారు. మరమ్మతులు చేసేచాన్స్ ఉన్నా వదల్లేదు. శ్రీవాణి ట్రస్ట్ నిధులను ఆలయ నిర్మాణాలకు విరాళాల పేరుతో చాలా వరకూ దుర్వినియోగం చేశారు.
అన్నింటికి మించి హుండీ దొంగతనం కూడా చేశారు. రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని తరలిస్తూ దొరికిపోయిన వైనంపై జరిగిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ నివేదికపై ప్రభుత్వం సీఐడీ కేసులు నమోదు చేసివిచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయి.