తమిళనాడు శాసనసభకి మే 16న ఎన్నికలు జరుగబోతున్నాయి. అంటే మరో మూడు వారాలు కూడా లేదన్నమాట. కనుక రాష్ట్రంలో రాజకీయ ప్రచారం ఊపందుకోవడంతో వేసవి వేడితో బాటు రాజకీయ వేడి కూడా బాగా పెరిగిపోయింది.
రాష్ట్రంలో అధికార అన్నాడిఎంకె పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె-కాంగ్రెస్ కూటమి, కెప్టెన్ విజయ్ కాంత్ నేతృత్వంలోని డి.ఎం.డి.కె. పార్టీతో పొత్తులు పెట్టుకొన్న ఎం.డి.ఎం.కె., టి.ఎం.సి., పి.డబ్ల్యూ.ఎఫ్. పార్టీల కూటమి మద్య ప్రధానంగా పోటీ జరుగుతోంది.
కనుక ఈ మూడు ప్రధాన కూటములు చాలా ఉదృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో ఎం.డి.ఎం.కె.పార్టీ అధినేత ‘వైగో’ గా సుపరిచితులయిన వి. గోపాలస్వామి తన పార్టీ నేతలకి, కార్యకర్తలకి ఊహించని ఒక పెద్ద షాక్ ఇచ్చారు.
ఆయన తూత్తుకూడి జిల్లాలోని కోవిల్ పట్టి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కానీ మొన్న తన నియోజక వర్గంలో ఎన్నికల ప్రచార రధం మీద నుంచి ప్రజలనుద్దేశ్యించి ప్రసంగిస్తూ, తను ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నట్లుగా ప్రకటించారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో డిఎంకె పార్టీ తననే లక్ష్యంగా చేసుకొని స్థానికంగా చాలా బలంగా ఉన్న దేవర్, నైకర్ అనే రెండు కులాల మధ్య ఘర్షణలు జరిపేందుకు కుట్రలు పన్నుతున్నట్లు తనకు సమాచారం అందిందని, తన మూలంగా సమాజంలో అశాంతి నెలకొనడం ఇష్టం లేకనే పోటీ నుంచి విరమించుకొంటున్నట్లు ప్రకటించారు. అంతే కాదు తనకు బదులు పార్టీకి చెందిన వినాయక రమేష్ పోటీ చేస్తారని ప్రకటించేశారు.
ఒకవేళ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలనుకొన్నా ఆ విషయం గురించి పార్టీ నేతలతో పార్టీ కార్యాలయంలో చర్చించాలే తప్ప ఎన్నికల ప్రచార రధం మీద నుంచే ప్రకటించడం ఏమిటని విస్తుపోతున్నారు. ఎన్నికల ప్రచారం ఇంకా ఉదృతం చేయవలసిన ఈ సమయంలో, స్వయంగా పార్టీ అధ్యక్షుడే ఈ విధంగా పలాయనం చిత్తగించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు షాక్ అయ్యారు. ఆయన కారణంగా తామందరం ఎన్నికలలో తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైగో మాత్రం వారి తరపున గట్టిగా ప్రచారం చేసి అందరినీ గెలిపిస్తానని అభయహస్తం ఇస్తున్నారు.