సోషల్ మెసేజ్ అనగానే.. కథానాయకులంతా పారిపోయే రోజులు పోయాయి. దానికి కారణం శంకర్. లంచం, అవినీతి అనే పాయింట్లను తీసుకొని, దాన్ని కమర్షియల్ పంథాలో చెప్పడం అలవాటు చేసిన దర్శకుడాయన. ఆ స్ఫూర్తి మురుగదాస్ కొంత వరకూ పాటించాడు. ఇప్పుడు శంకర్ శిష్యుడు అట్లీ కూడా అదే దారిలో నడిచాడు. అట్లీ రాసిన ‘మెర్శెల్’ కథ.. కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాకంపై మెరుపు దాడి. దీన్ని పూర్తిగా కమర్షియల్ స్టైల్లో చెప్పాడు. అటు తన కథ చెడకుండా, ఇటు హీరో విజయ్ ఇమేజ్‌కి డామేజ్ అవ్వకుండా, మాస్‌కి నచ్చేలా, క్లాస్‌తో చప్పట్లు కొట్టించాలా.. తీర్చిదిద్దాడు. అందుకే ‘మెర్శెల్’ తమిళనాట ఘన విజయాన్ని అందుకొంది. మరి తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఇందులో ఏమున్నాయి?? ఇక్కడ ‘అదిరింది’ రిపోర్ట్ ఏమిటి??
కథ
హైదరాబాద్ నగరంలో వరుసగా నాలుగు కిడ్నాపులు జరుగుతాయి. దీనికీ డాక్టర్ భార్గవ్ (విజయ్)కీ సంబంధం ఉందన్నది పోలీసుల అనుమానం. భార్గవ్ ఆశయం ఒక్కటే… – పేదలందరికీ ఉచిత వైద్యం. కేవలం అయిదు రూపాయలు తీసుకొని పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తుంటాడు. ఇతని సేవకు మెచ్చి పలు దేశాలు అవార్డులు కూడా ప్రకటిస్తాయి. అలాంటి భార్గవ్ ఈ కిడ్నాపులు ఎందుకు చేశాడు. అచ్చం భార్గవ్ లా ఉండే విజయ్ (మరో విజయ్) ఎవరు??? వీరిద్దరికీ దళపతి (మూడో విజయ్)కీ ఉన్న సంబంధం ఏమిటి?? అనేదే `అదిరింది` కథ.
విశ్లేషణ
హెల్త్ చెకప్‌కి వెళ్తే… ఆరోగ్యవంతుడు కూడా పేషెంట్ అయిపోతున్న రోజులువి. జబ్జు ఒకటి, ట్రీట్ మెంట్ మరోటి. తలపోటు వస్తే… కడుపుకీ స్కానింగ్ చేయాల్సిన పరిస్థితి. సిజేరియన్లకు అలవాటు పడిపోయి, నార్మల్ డెలివరీ ఓ వింతగా తోస్తోంది.చావు బతుకులతో పేషేంట్ పోరాడుతోంటే, బిల్లు కట్టమని పోరు పెట్టే ఆసుపత్రి సిబ్బంది.. ఇవన్నీ కళ్లారా చూస్తున్నాం. కష్టమైనా నష్టమైనా భరిస్తున్నాం. వీటినే అట్లీ కథగా రాసుకొన్నాడు. ఈ వ్యవస్థపై తిరుగుబాటు చేయడానికి ఓ కథానాయకుడ్ని సృష్టించాడు. అదే `అదిరింది` కథ. వైద్యం అనే పాయింటుకి సగటు ప్రేక్షకుడు త్వరగా కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే అది తన జీవితావసరం. కాబట్టే దీనికంటే గొప్ప కమర్షియల్ పాయింట్ లేదు. కథని ప్రారంభించిన విధానం, భార్గవ్ ఇంట్రాగేషన్, ఫ్లాష్ బ్యాక్… ఇవన్నీ రక్తి కట్టిస్తాయి. విజయ్ ఒకరు కాదు, ఇద్దరు అని చెప్పే సీన్లో…. స్క్రీన్ ప్లే నిజంగా అదిరింది.
మామూలుగా చెప్పాలంటే ఇదో రివైంజ్ డ్రామా. తండ్రిని చంపిన కీచకుడిపై ఇద్దరు కొడుకులు తీర్చుకొనే రివైంజ్. ఈ కథతో చాలా సినిమాలొచ్చాయి. అయితే అదిరింది చూస్తే.. అవేం గుర్తుకు రావు. దానికి కారణం… దానిని కేవలం ఓ పూతగా మాత్రమే వాడుకొన్నాడు. అసలు కథంతా.. కార్పొరేట్ వైద్యం చుట్టూనే తిరుగుతుంది. డాక్టర్లు, వైద్యం.. వీటిచుట్టూ నడిచే సంభాషణలు సన్నివేశాలు ఆకట్టుకొంటాయి.
వైద్య రంగంలో ఇంత మోసం జరుగుతుందా? డాక్టర్లు ఇలా ఆలోచిస్తారా?? అని భయం వేస్తుంది కూడా. నిత్యమీనన్ సర్జరీని చాలా డిటైల్డ్‌గా చూపించారు. నిజానికి అంత అవసరం లేదక్కడ. కాకపోతే అదే సన్నివేశంలో విజయ్ తన ప్రేమ కథ చెప్పడం, దానికి పూర్తి రివర్స్‌లో ఆసుపత్రిలో జరుగుతున్న ఆపరేషన్ విజువల్స్ ప్లే అవ్వడం ఆడియన్స్ ఎమోషన్స్‌కి కనెక్ట్ అయ్యే పాయింటే.
నటీనటుల ప్రతిభ
మాస్లో విజయ్‌కి ఉన్న ఇమేజ్ వేరు. అతనేం చెప్పినా జనాలు వింటారు. దాన్ని అట్లీ బాగా వాడుకొన్నాడు. భార్గవ్, విజయ్ పాత్రల్ని డిజైన్ చేసిన విధానం బాగుంది. దళపతి కూడా నచ్చుతాడు. మూడు పాత్రల్లో పెద్దగా వైవిధ్యం లేదు గానీ, దళపతి మీసకట్టు మాత్రం మాస్‌కి మరింత నచ్చేలా ఉంది. నిత్యమీనన్ మినహాయిస్తే మిగిలిన ఇద్దరు హీరోయిన్లు కాజల్, సమంతలవి చిన్న చిన్న పాత్రలే. నిత్య మరీ లావుగా కనిపిస్తోంది. ఈ పాత్ర వరకూ ఓకే. ఇలానే మళ్లీ మళ్లీ చూడాలంటే మాత్రం కష్టం. స్పైడర్‌లో విలన్‌గా కనిపించాడు సూర్య. ఇప్పుడూ విలనే. కాకపోతే.. ఇందులో మరింత స్టైలీష్‌గా ఉన్నాడు. తన పాత్ర కూడా నచ్చుతుంది.
సాంకేతిక వర్గం
రెహమాన్ పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. డబ్బింగ్ విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉన్నారేమో అనిపిస్తోంది. కొన్ని మాటలు కూడా వినిపించలేదు. పాటలైతే చెప్పక్కర్లెద్దు. కెమెరా హై క్లాస్. ఫస్టాఫ్‌లో స్క్రీన్ ప్లే కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. డైలాగులు మాస్‌కి నచ్చేలా ఉన్నాయి. సెన్సార్ సమస్యల వల్ల కొన్ని డైలాగులు వినిపించకుండా పోయాయి. బలమైన సామాజిక అంశాన్ని కమర్షియల్ ప్యాకేజీతో ఎలా
అందించొచ్చో అట్లీ చూపించాడు.
తీర్పు
మాస్‌కి నచ్చే అంశాల ప్యాకేజీ ఈ సినిమా. అయితే కథాంశం బలంగా ఉండడం, అందులో సామాజిక అంశాన్ని మేళవించడం తప్పకుండా నచ్చుతుంది. తమిళ వాసన ఎక్కువ కొట్టడం కాస్త ఇబ్బంది పెట్టే విషయం. వైద్య రంగాన్ని వ్యాపారం చేయడం అనేది ఎవ్వరికైనా కనెక్ట్ అయిపోయే పాయింట్.
ఫైనల్ టచ్: నిజంగానే… ‘అదిరింది’