‘కల్కి’ సినిమా మహాభారతంపై ఓ ఆసక్తికరమైన చర్చని లేవనెత్తింది. భారతంలోని ఘట్టాలని స్ఫూర్తిగా తీసుకొని ఈ కథని మలిచాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇందులో కర్ణుడు, అర్జునుడి పాత్రల ప్రస్తావన వుంది. కల్కి క్లైమాక్స్ అద్భుతంగా పండటానికి కారణం.. మహాభారతంలోని ఈ రిఫరెన్సే. గూస్ బంప్స్ తెప్పించేలా ఆ సీక్వెన్స్ ని చిత్రీకరించాడు నాగ్ అశ్విన్. ఇందులో ప్రభాస్ ని కర్ణుడిగా, విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించారు.
ఇక్కడే అసలు చర్చ మొదలైయింది. ప్రభాస్ హీరో. కర్ణుడి పాత్రలో ధీరోదాత్తంగా కనిపించాడు. దీంతో అసలు భారతంలో అందరికంటే పరాక్రమవంతుడు కర్ణుడే.. అని కొందరు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.
అయితే భారతం గురించి కొంచెం లోతుగా అవగాహన వున్నా వారు మాత్రం.. ప్రామాణికంగా చూసే వ్యాస భారతంను ఉటంకిస్తూ అసలు అర్జునుడి కంటే కర్ణుడు ఎంత బలహీనమైన వాడో, ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయాడో పర్వాలతో సహా చూపుతున్నారు.
భారతంలోని శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు – ఈ నలుగురూ చెడ్డపనులకు ప్రతీతీ. స్వయంగా వ్యాస భగవానుడే ఈ నలుగురిని ‘దుష్ట చతుష్టయం’ అని వర్ణించారని, అభిమన్యుడని చంపిన వారిలో కర్ణుడొకడని, చివరికి అర్జునుడి చేతిలోనే వధించబడ్డాడని గుర్తు చేస్తూ .. అర్జునుడి కంటే కర్ణుడు ఎందులోనూ గొప్ప కాదని వాదిస్తున్నారు.
నిజానికి పురాణాలు ఆధారంగా ఏ సినిమా వచ్చినా ఇలాంటి చర్చ తెరపైకి వస్తుంది. గతంలో కూడా కొన్ని సినిమాలు పురాణాలని వక్రీకరించాయనే విమర్శలు వున్నాయి.
అయితే వాస్తవానికి ఈ వక్రీకరణ అనేది కేవలం సినిమాల్లో కాదు… పుస్తకాల్లో, ప్రవచనాల్లో కూడా జరుగుతోంది. కర్ణుడి గొప్పదనం గురించి ప్రవచనం చెప్పమంటే.. అతనంత వీరుడు సూరుడు మరొకడు లేడని చెప్పే పెద్దమనిషే.. అర్జునుడి ప్రస్తావన వచ్చినప్పుడు.. అర్జునుడి ముందు కర్ణుడు ఆఫ్ట్రాల్ అని నొక్కి వక్కాణిస్తుంటాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే పాత్ర చేసే హీరోని బట్టి కొన్ని సన్నివేశాలు నడుపుతుంటారు. గతంలో ఎన్టీఆర్ అర్జునుడి పాత్ర ధరిస్తే.. కర్ణుడు యుద్ధంలో భయపడి పారిపోయినట్లు చిత్రీకరించారు. అదే ఎన్టీఆర్ కర్ణుడి పాత్ర వేసినప్పుడు యుద్ధ భూమిలో కర్ణుడిని చూసి అర్జునుడు వణికిపోయినట్లు చిత్రీకరించారు.
ఇదంతా కూడా కథని ఏ కోణం నుంచి చూస్తున్నాం? అనేదానిపై ఆదారపడి వుంటుంది. అన్నిటికి మించి సినిమాని వినోదం కోణం నుంచి చూడాలే కానీ ఇలాంటి వాదనలు జోలికి వెళ్ళడం అనవసరమైన రాద్దాంతంగానే భావించాలి.