కేరళలో వరదలు తగ్గడం లేదు. అలాగే.. సోషల్ మీడియాలో.. కేరళకు వస్తున్న విరాళాలు వెల్లువ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి ఒక్కరూ రూ. వంద నుంచి రూ. లక్షలు… కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి మనీ ట్రాన్స్ ఫర్ చేసి… సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నేను సైతం అంటూ… కొంత మంది ఉత్సాహం కల్పిస్తున్నారు. అయితే వీటిలో ఫేక్ విరాళాల వ్యవహారమూ తక్కువ లేదు. డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు రాసుకునేవారికి లెక్కలేకపోయినా… స్టార్ల విషయంలో… పుట్టుకొస్తున్న వ్యవహారాలే అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి.
నాలుగు రోజుల క్రితం… తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ ఏకంగా రూ. 14 కోట్లు డొనేట్ చేశాడని ప్రకటించారు. విజయ్ దానకర్ణుడే కానీ.. మరీ ఈ స్థాయిలో దానం చేస్తాడని ఎవరూ ఊహించలేదు. నిజానికి నాలుగైదు లక్షలు డొనేట్ చేస్తేనే… సినిమా తారల పీఆర్వోలు రూ. 50 లక్షలకు సరిపడా పబ్లిసిటీని పొందేలా ప్లాన్ చేస్తారు. అలాంటిది విజయ్ రూ. 14 కోట్లు ప్రకటిస్తే సైలెంట్ గా ఎందుకు ఉంటారు..?. విజయ్ ప్రకటించిన ఈ రూ. 14 కోట్ల వ్యవహారం.. సోషల్ మీడియాలో మాత్రమే వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాలేదు. తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎలాంటి ధృవీకరణ రాలేదు. కానీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఉద్ధృతంగా ప్రచారం చేసేసుకుంటున్నారు. అలాంటిదే.. తాజాగా.. సన్నీ లియోనీ విషయంలోనూ జరగుతోంది. ఆమె రూ. 5 కోట్లు ప్రకటించారనే వార్త గుప్పు మంది. కానీ సన్నీ క్యాంప్ నుంచి కానీ.. పీఆర్వోల నుంచి కానీ ఎలాంటి ప్రకటనా రాలేదు. అసలు నిజంగా ఇచ్చారో లేదో కూడా.. ఎవరికీ తెలియదు. కొద్ది రోజుల కిందట సన్నిలియోనీ… కొచ్చిలోఓ షాపు ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు….ఆమెను చూసేందుకు లక్షల మంది తరలి వచ్చారు. దాంతో కొచ్చి మొత్తం జామైపోయింది. ఈ అభిమానం కారణంగానే రూ. 5 కోట్లు ప్రకటించారని నెటిజన్లు చెప్పుకొచ్చారు.. కానీ డబ్బులు ఇచ్చి ఉంటే.. సన్నీ కనీసం తన సోషల్ మీడియాలో అయినా ప్రకటించుకుని ఉండేవారు కదా..!
నిజానికి టాలీవుడ్, కోలీవుడ్ నటులు.. తాము కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్న సాయాన్ని ఎప్పటికప్పుడు…మీడియాకు అధికారికంగా తెలియజేస్తున్నారు. కానీ ఇతర హీరోల అభిమానులు మాత్రం… తమకు ఉన్న ఉత్సాహం కొద్దీ… కొత్త కొత్త విరాళాల వివరాల ప్రకటించేస్తున్నారు. ప్రచారంలోకి పెడుతున్నారు. కానీ .. ఇవన్నీ దాదాపుగా ఫేక్ విరాళాలే. వారు అధికారికంగా ప్రకటిస్తే తప్ప నమ్మడానికి వీలు లేదు.