సింగిల్ ఎక్స్ప్రెషన్తో సినిమాలు చేసే నటుల్లో విజయ్ ఆంటోనీ ఒకడు. తన నటన ఎలా ఉన్నా, ఎంచుకొనే కథలు బాగుంటాయి. అందుకే తెలుగులో తనకంటూ అభిమానులు ఏర్పడ్డారు. సలీమ్, డాక్టర్, నకిలీ.. ఇవన్నీ మంచి కథలే. బిచ్చగాడుతో మాత్రం విజయ్ ఆంటోనీ జాతకం మారిపోయింది. ఈసినిమా కాసుల వర్షం కురిపించుకొంది. ఆ తరవాత… అన్నీ ఫ్లాపులే. విజయ్ సినిమాల బడ్జెట్లూ, బిజినెస్సులూ పెరుగుతూ పోయాయి. కానీ హిట్టు మాత్రం దక్కలేదు. విజయ్ ఆంటోనీ కూడా మూసలో కలిసిపోతున్నాడా? అనిపించింది.
ఈ దశలో విజయ్ తన ట్రంప్ కార్డు వాడాడు. తనకు పేరునీ, క్రేజ్‌నీ తీసుకొచ్చిన బిచ్చగాడు కి సీక్వెల్ గా బిచ్చగాడు 2 తీశాడు. ఈ సినిమాలో హీరోతనే. దర్శకుడూ తనే. సంగీతం, ఎడిటింగ్, నిర్మాణం.. ఇలా చాలా బాధ్యతలు భుజాన వేసుకొన్నాడు. అయితే విడుదలకు ముందు ఈ సినిమాకి సరైన పబ్లిసిటీ లేదు. క్రేజ్ కూడా లేదు. తొలి రోజు రివ్యూలూ అంతంత మాత్రమే. కానీ బాక్సాఫీసు దగ్గర మాత్రం వసూళ్లు ఓ రేంజ్లో ఉన్నాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 4 కోట్ల గ్రాస్ సొంతం చేసుకొంది. ఆదివారం నాటికి అది రూ.10 కోట్లు అయ్యింది. ఓ డబ్బింగ్ సినిమాకి, అందులోనూ ఓ చిన్న హీరో సినిమాకి, ఎలాంటి క్రేజ్ లేని ప్రాజెక్ట్ కి రూ.10 కోట్లు రావడం మామూలు విషయం కాదు. విచిత్రం ఏమిటంటే… తెలుగుతో పోలిస్తే తమిళంలోనే వసూళ్లు కాస్త తక్కువగా ఉన్నాయి. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టాడు విజయ్. బిచ్చగాడులా విజయ్ ఆంటోనీకి ఈ సినిమా భారీ లాభాల్ని తెచ్చి పెట్టకపోవొచ్చు. కానీ పరువు మాత్రం నిలబెట్టింది. మరో సినిమా చేయడానికి ధైర్యాన్ని ఇచ్చింది. విజయ్‌కి ఓరకంగా మళ్లీ ఊపిరి పోసిన సినిమా ఇది.