టీజర్, ట్రైలర్లలతో ఆకట్టుకొన్న సినిమా అర్జున్ రెడ్డి. పెళ్లి చూపులు తో సూపర్ డూపర్ హిట్ దక్కించుకొన్న విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి అర్జున్ రెడ్డిపై హోప్స్ పెట్టుకొన్నారు. ఈనెల 25న అర్జున్ రెడ్డి విడుదల కాబోతోంది. సెప్టెంబరు 1న బాలయ్య సినిమా వస్తోంది కాబట్టి.. ఈలోగానే అర్జున్ రెడ్డిని విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. కాకపోతే.. ఇప్పుడు అర్జున్ రెడ్డికి కొత్త సమస్యలు చుట్టుకొన్నాయి. మరీ ముఖ్యంగా సెన్సార్ నుంచి. ఈ సినిమా డైలాగుల్లో చాలా సార్లు బూతులు ధ్వనించాయట. తెలంగాణ స్లాంగ్‌లో కొన్ని డైలాగులు బూతుల్లా అనిపిస్తుంటాయి. కానీ వాటిని సర్వసాధారణంగా వాడేస్తుంటారు. అలాంటి డైలాగులు ఈ సినిమాలో కోకొల్లలుగా ఉన్నాయట. దానితో పాటు లిప్ లాక్‌లు, బెడ్రూమ్ సీన్లు కాస్త ఓవర్‌గా ఉన్నాయని తెలుస్తోంది. వీటిని కట్ చేస్తే.. సినిమాలో మజా పోతుందని అర్జున్ రెడ్డి టీమ్ భయపడుతుంది. సెన్సార్ కూడా ఆ సీన్ల దగ్గర పట్టుపట్టే ఛాన్స్ ఉందట. సెన్సార్ కత్తెర్లకు బలి కాకుండా సినిమాని ఎలా కాపాడుకోవాలా అంటూ తర్జన భర్జనలు పడుతోంది చిత్రబృందం. ఒకవేళ సెన్సార్ కనుక ఈ సినిమాపై అభ్యంతరాలు చెబితే.. ఈనెల 25న అర్జున్‌రెడ్డిని చూళ్లేం.