ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి యువహీరో విజయ్ దేవరకొండ రూ. 25 లక్షల విరాళం ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి గాను విజయ్ దేవరకొండకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం వచ్చింది. దాన్ని వేలం వేయగా వచ్చిన పాతిక లక్షల రూపాయలను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశాడు. తాజాగా మరోసారి తన పెద్దమనసును చాటుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం భారీ వర్షాలతో, వరదలతో కేరళలో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి, సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రజల నుంచి విరాళాలు కోరుతున్నారు. కేరళ ప్రజల పరిస్థితి చూసి చలించిన విజయ్ దేవరకొండ ఐదు లక్షలు విరాళంగా ఇచ్చారు. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి డబ్బును ట్రాన్స్ఫర్ చేశారు. అభిమానులను, ప్రేక్షకులను తమకు తోచినంత, ఎంతోకొంత సహాయం చేయమని ట్వీట్ చేశారు. “మనం చేసే చిన్న సహాయమైనా కేరళలోని మనలాంటి వాళ్ల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొస్తుంది” అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.