విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. అర్జున్ రెడ్డి విజయంతో ఒక్కసారిగా యువతరంలో తనకున్నక్రేజ్ డబుల్ ట్రిపుల్ అయ్యింది. తన ఆటిట్యూడ్ కూడా యూత్‌కి బాగా నచ్చుతోంది. దానికి తగ్గట్టేగా యూత్ ఫుల్ కథల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ట్రెండ్ ని ఫాలో అవుతున్నాడు. అవార్డు వేడుకల్లో, సినిమా ఫంక్షన్లలో చాలా ట్రెండీగా కనిపిస్తూ యూత్‌ని ఎక్ట్రాక్ట్ చేస్తున్నాడు. యూత్ హీరోల్లో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఫ్యాన్ ఫాలోయింగ్‌నీ మెల్లమెల్లగా పెంచుకుంటున్నాడు. అందుకోసం విజయ్ పాటిస్తున్న ఫార్ములా ఆసక్తికరంగా ఉంది. ఇటీవల తన పుట్టిన రోజున… హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లలో ఐస్‌క్రీమ్స్ పంచి పెట్టాడు. ఫిల్మ్ ఫేర్ అవార్డులకు చెన్నై వెళుతూ తనతో పాటు ఓ అభిమానిని కూడా తీసుకెళ్లాడు. తన వెబ్ సైట్లో పేర్లు నమోదు చేయించుకున్నవాళ్లలో ఒకరిని ఎంపిక చేసుకుని.. తన ఖర్చులతో చెన్నై తీసుకెళ్లాడు. ఫిల్మ్ ఫేర్ అవార్డుని వేలం వేసి, ఆ డబ్బుని సీఎమ్ రిలీఫ్ ఫండ్ కి ఇస్తాననడం కూడా అందరినీ ఆకట్టుకుంది.
ఫిల్మ్ ఫేర్ అవార్డులకు వెళ్తున్నప్పుడు ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘చిరు, బాలయ్య లతో పోలిస్తే నేనో బచ్చాగాడ్ని. వాళ్లతో పాటు నాకు నామినేషన్ రావడమే గొప్ప అవార్డు’ అని చెప్పి అగ్ర హీరోలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. అంతేనా..? వాళ్ల అభిమానుల హృదయంలోనూ స్టానం సంపాదించుకున్నాడు. ఇవన్నీ ప్రేక్షకుల్ని అభిమానులుగా మార్చుకునే ప్రయత్నం కావొచ్చు, కాకపోవచ్చు. కానీ విజయ్ దేవరకొండపై ఓ స్పెషల్ ఫోకస్ పడడానికి, తనని అభిమానించేలా చేసుకోవడానికి ప్రేరణగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మున్ముందు కూడా ఇలానే కూల్ అండ్ కామ్‌గా… తన వినమ్రతని చాటుకుంటూ ఉంటే, దాంతో పాటు ఈ ఆటిట్యూడ్‌ని వదలకుండా ముందుకు సాగుతుంటే….. తప్పకుండా విజయ్కంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడుతుందనడంలో సందేశం లేదు.