విజయ్ దేవరకొండ కెరీర్ ఎంతని? ఎన్ని సినిమాలు చేశాడని? అప్పుడే లవ్ స్టోరీలపై విరక్తి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అవును… `వరల్డ్ ఫేమస్ లవర్` తన చిట్ట చివరి ప్రేమకథా చిత్రమని ప్రకటించేశాడు. అంటే విజయ్ కోసం ఎవ్వరూ ప్రేమకథలు రాయకూడదన్నమాట. రాసినా చేయడన్నమాట..?
విజయ్ చేసిన సినిమాల్లో ప్యూర్ లవ్ స్టోరీలు చాలా తక్కువ. పెళ్లి చూపులు కూడా పూర్తిస్థాయి ప్రేమకథేం కాదు. అర్జున్ రెడ్డి లో ప్రేమ కంటే, దాన్ని చూపించి కోణం కొత్తగా ఉంటుంది. గీత గోవిందంలో ప్రేమని వినోదం, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ డామినేట్ చేశాయి. డియర్ కామ్రేడ్ ప్రేమకథే. టాక్సీవాలా, నోటా.. ఇవి రెండూ వేర్వేరు జోనర్ల సినిమాలు. అంటే పట్టుమని రెండు లవ్ స్టోరీలు కూడా చేయని విజయ్.. ఇప్పుడు ప్రేమకథా సన్యాసం తీసుకోవడం ఏమిటో..?
`వరల్డ్ ఫేమస్ లవర్` ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం కాసేపటి క్రితం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ఇదే తన చివరి ప్రేమకథా చిత్రమని చెప్పేశాడు. ఈ సినిమా చేస్తున్నప్పుడు తన చివరి ప్రేమకథ ఇదే అవుతుందని తనకు అర్థమైందని, అందుకే ఈ సినిమాలోనే తన ప్రేమనంతా ధారబోశారని చెప్పుకొచ్చాడు విజయ్. తన అభిరుచులు మారుతున్నాయని, మనిషిగానూ మార్పులొస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని కాస్త షాకింగ్ కామెంట్లు చేశాడు.