ఇండస్ట్రీలో హిట్ ఎంత ముఖ్యమో సక్సెస్ ని కాపాడుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతాయి. ఎంతటి హీరో అయినా వరుసగా రెండు ఫ్లాపులు పడితే డిఫెన్స్ లోకి వెళ్ళిపోతాడు. అంతేకాదు ఇమేజ్ చట్రంలో పడిపోయి మాయమైపోయిన స్టార్లు చాలా మంది కనిపిస్తారిక్కడ. ఒక సక్సెస్ పడింది కదా అని అదే మూసలో సినిమాలు చేసి కనుమరుగైపోయిన స్టార్లు చాలామంది. తరుణ్, ఉదయ్ కిరణ్, సిద్ధార్ద్.. అలా మెరిసి మాయమైపోయిన స్టార్లే. వీళ్ళ ట్రెండ్ నడుస్తున్నప్పుడు స్టార్ డమ్ లో పీక్స్ చూశారు. యుత్ ఫుల్ స్టార్లు అనిపించుకున్నారు. కానీ ఒకటి గ్రహించలేదు. ఒక ముసలో ఇరుక్కుపోయారనే సంగతి. ఇది తెలుసుకున్నప్పటికీ చాలా నష్టం జరిగిపోయింది. ప్రేక్షకులు ముఖం చాటేసిన పరిస్థితి. దిని కారణం వాళ్ళు ఎంచుకున్న కధల్లో వైవిధ్యం లోపించడమే. అయితే ఇప్పుడు అలాంటి తప్పులు మళ్ళీ జరక్కూడదని ఇప్పటి హీరోలు చక్కటి ప్లాన్ వేసుకుంటున్నారు. జోనర్లను మార్చేస్తున్నారు. హిట్ వచ్చింది కదా అనే అదే జోనర్ కి పరమితం అవ్వడం లేదు. కంప్లీట్ డిఫరెంట్ సేఫ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవర కొండ ప్లాన్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది.
పెళ్లి చూపులు సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఏకంగా యూత్ ఐకాన్ ఐపోయాడు. ఇప్పుడు విజయ్ దేవర కొండ సినిమా అంటే మార్కెట్ లో ట్రెండీ ఐటెం. విజయ్ కూడా చక్కని ప్రణాళికతో వెళ్తున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. టాక్సీవాలా విడుదలకు సిద్దం అవుతుంది. ఇది రోడ్ జర్నీ మూవీ. అలాగే నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలు విజయ్ నుండి రానున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా ఒకదానికి ఒకటి మ్యాచ్ కాకుండా డిఫరెంట్ జోనర్ సినిమాలు. అంతేకాదు దర్శకులు కూడా కొత్త. ఫ్రెస్ థాట్ తో రాసుకున్న కధలివి. మాస్ అని ఊగిపోకుండా వైవిధ్యానికి అవకాశం ఇస్తూ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోపోకుండా ప్లాన్ వేసుకుంటున్నాడు విజయ్. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ తో సినిమా చేయడనికి పెద్ద దర్శకులు కూడా రెడీ అయ్యారు. విజయ్ మాత్రం విభిన్న కధలకు ప్రాధన్యత ఇస్తూ కెరీర్ ని ప్లాన్ చేశాడు. ఒక విధంగా ఇది మంచిదే. ఇప్పుడు విజయ్ ఓకే చేసిన సినిమాల్లో కనీసం రెండు హిట్లు పడినా అతడి నుండి మరింత వైవిధ్యాన్ని ఆశించవచ్చు. సో.. విజయ్ కి విజయాలు దక్కలానే కోరుకుందాం.