సినిమా విజయంలో ప్రచార పర్వం కీలక పాత్ర పోషిస్తోంది. ఓ సినిమాని జనాల్లోకి ఎంత బాగా తీసుకెళ్లామన్నదానిపై ఆ సినిమా విజయావకాశాలు ఎక్కువగా ఆధారపడతాయి. స్టార్ హీరోలు ఈమధ్య ప్రచారం అవసరాన్ని బాగానే గ్రహించారు. కాకపోతే… ఇప్పటికీ కొంతమంది ఈ విషయంలో బద్దకిస్తుంటారు. ఏదో మొక్కుబడిగా ఇంటర్వ్యూలు ఇచ్చేసి – తమ పని అయిపోయిందనుకుంటారు. ఈ విషయంలో విజయ్‌దేవరకొండని మెచ్చుకుని తీరాలి. తన కొత్త సినిమా `డియర్ కామ్రేడ్`కి తాను తన వంతుగా తీసుకొస్తున్న హైప్‌ని, ఆ సినిమాని జనంలోకి తీసుకెళ్తున్న విధానాన్ని చూస్తే ముచ్చటేస్తోంది.
గీత గోవిందం, టాక్సీవాల తరవాత విజయ్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో హిట్టు కొడితే – స్టార్ హీరోల రేసులో విజయ్ దేవరకొండ మరింత ముందుకొస్తాడు. అందుకే `డియర్ కామ్రేడ్`పై ప్రత్యేక దృష్టి పెట్టాడు విజయ్. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ప్రచారం అటూ ఇటుగా చేసినా ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం. కానీ.. విజయ్ మాత్రం రిలాక్సయిపోవడం లేదు. ఈ సినిమాని మరింతగా జనంలోకి తీసుకెళ్లిపోతున్నాడు. సంగీతోత్సవం పేరుతో విజయ్.. ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాని తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేస్తున్నారు. ఈ మూడు చోట్లా.. సంగీతోత్సవం పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించి, పాటలకు స్టేజీపై ఆడి పాడాడు. హైదరాబాద్‌లోనూ ఈ షో సాగింది. ఇందులో రష్మితో కలసి డాన్స్ చేశాడు విజయ్. పాటలు పాడి అలరించాడు. ఈ షో కోసం రాత్రిళ్లు మేల్కొని మరీ.. ప్రాక్టీస్ చేశాడు. షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా – ప్రమోషన్ని ఏమాత్రం తక్కువ చేయకూడదన్న ఉద్దేశంతో – ఓవర్ టైమ్ పని చేశాడు. తన టీమ్‌ని ముందుండి నడిపించాడు. సినిమా షూటింగ్ అయిపోయిన దగ్గర్నుంచి ఇప్పటి వరకూ ప్రతీ ప్రమోషన్ ఈవెంట్నీ తానే ప్లాన్ చేశాడు. విజయ్ కి ఇప్పుడున్న క్రేజ్‌కి… ఏం చేయకపోయినా ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. కానీ.. తాను మాత్రం ఏ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండడం లేదు. విజయ్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్న విధానం చూసి అగ్ర నిర్మాణ సంస్థలు, బడా హీరోలు సైతం తెల్లమొహాలేస్తున్నారు. ప్రమోషన్ విషయంలో విజయ్ దేవరకొండ టాలీవుడ్‌కి కొత్త పాఠాలు నేర్పినట్టే.