అర్జున్ రెడ్డిలాంటి ఓ సినిమా గురించి జనం ఇప్పుడే కాదు, ఆ సినిమా విడుదలకు ముందు కూడా `గట్టిగా` మాట్లాడుకున్నారు. దానికి కారణం… విజయ్ దేవరకొండ ఈ సినిమాకి తీసుకొచ్చిన పబ్లిసిటీనే. ట్రైలర్‌లోని ఓ డైలాగ్పై బోలెడంత రచ్చ జరిగింది. దానికి విజయ్ దేవరకొండ కూడా చాలా ఘాటుగా స్పందించేవాడు. ట్విట్టర్లో… కొన్ని తేడా తేడా కామెంట్లు చేయడం, మీడియా ముందు.. యారగెంట్ గా మాట్లాడడం ఇవన్నీ ఈ సినిమా గురించి చర్చించుకునేలా చేశాయి. దాంతో విడుదలకు ముందే ఈ సినిమా కాస్త అటెన్షన్ తెచ్చుకుంది. సినిమా అద్భుతంగా ఉండడంతో.. అదే అటెన్షన్ అలా అలా కొనసాగుతూ వెళ్లింది.
సేమ్ టూ సేమ్ ఇదే స్ట్రాటజీ ‘మహానటి’ కోసం కూడా విజయ్ దేవరకొండ ఫాలో అవుతున్నాడా? అనిపిస్తోంది. ఈ రోజు విజయ్ ‘మహానటి’ గురించి ఓ ట్వీట్ చేశాడు. సావిత్రి ఫొటోల్ని షేర్ చేస్తూ – వాటే కూల్ చిక్స్ అంటూ ట్వీటాడు. విజయ్ ఉద్దేశం ఏమో గానీ, నెటిజన్లు మాత్రం విజయ్‌పై దాడిగి దిగారు. సావిత్రిలాంటి పెద్దవాళ్లని గౌరవించడం నేర్చుకో అంటూ క్లాసు పీకారు. దానికి మనోడూ గట్టిగానే తగులుకున్నాడు. వాళ్లతో ఎటకారాలు చేశాడు. క్షమాపణలు చెప్పాలనుకున్నవాళ్లంతా చెన్నై రావాలని, అక్కడ మహానటి ఆడియో ఫంక్షన్ కి పాసులు ఇస్తానని, మీలాంటి నీతిమంతుల బ్యాచ్‌ని చూస్తే సావిత్రి సంతోషిస్తుందని, మీలాంటి వాళ్లే సావిత్రిని తాగుబోతుగా ముద్ర వేశారని.. ఇలా రకరకాలుగా రాసుకొచ్చాడు. ఇదంతా నెటిజన్లపై కోపమా, లేదంటే.. ‘సావిత్రి’ ని ఈ రకంగా ప్రమోట్ చేయాలనుకుంటున్నాడా? అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. జనాలు ఇలాంటి టాపిక్కులతో సినిమా గురించి మాట్లాడుకుంటారు. బాగానే ఉంది. కానీ.. అన్ని సినిమాలూ ఒకలా ఉండవు. మహానటి ని జనంలోకి తీసుకెళ్లాల్సిన పద్ధతి ఇది కాదు. ఆమె పట్ల, ఆ సినిమా పట్ల గౌరవ భావంతో ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్ల ముందు ‘మహానటి’ని తేలిక చేయడం ఎందుకు? ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కాకపోతే సరే సరి. లేదంటే ఇలాంటి ట్రిక్కుల వల్ల సినిమాపై నెగిటీవ్ ఇంప్రెషన్ పడే ప్రమాదం ఉంది.