గీత గోవిందం.. టైటిల్ ఎంత బాగుందో కదూ. ఇదో క్యూట్ క్యూట్ లవ్ స్టోరీ అని టైటిల్, టీజర్ చూస్తే అర్థమైపోతోంది. పైగా పరశురామ్ ఇలాంటి క్లీన్ సినిమాలే తీస్తుంటాడు. గీతా ఆర్ట్స్సంస్థ కూడా… క్లీన్ యూ సినిమాలు తీసే టైపు. ఇప్పటి వరకూ అచ్చం ఇలానే క్లీన్ ఇమేజ్‌తో అలరించిన గీత గోవిందంపై ఇప్పుడు మరకలు పడుతున్నాయా? వివాదాల్ని ఈ సినిమా కోరుకుంటోందా? తద్వారా పబ్లిసిటీ పెంచుకోవాలన్న తలంపుతో ఉందా? వ్యవహారం చూస్తే ఇలానే అనిపిస్తోంది. ఇప్పటి వరకూ క్లీన్ యూ అనిపించిన గీతా గోవిందాన్ని ఓ పాట వివాదాల్లోకి లాగడానికి సహాయం చేసింది. అదే.. విజయ్ పాడిన ‘ఎఫ్’ గీతం. ఎఫ్ అంటే ఏమిటో తెలియని వెర్రిజనం ఎవరూ లేరిక్కడ. దానికి తోడు.. ఈ పాటలోని కొన్ని పదాలు మరీ అభ్యంతరకరంగా కనిపిస్తున్నాయి. ”రాముడు గాని ఇప్పుడు పుట్టి….జంగల్ కు పోదాం రారమ్మంటే….సీతకు కాస్త సిరాకు లేసి సోలోగానే పొమ్మంటాదే….యమపాశంతో యముడే వచ్చి నీ పెనిమిటి ప్రాణం తీస్తానంటే….నెట్ ఫ్లిక్స్ చూస్తూ ఈ సావిత్రి….లేటేంటంటూ కుమ్మేస్తాదే….మగాళ్లకి గోల్డెన్ డేసు పురాణాల్లోనే బాసు….” అంటూ సాహిత్యం పురాణాల్లోని పాత్రల్ని ఈ పాటలోకి లాక్కొచ్చి ఓ వర్గం మనోభావాలు దెబ్బతీయడానికికారణమైంది. ఇప్పుడు ఆ సైడు నుంచి ఈ సినిమాపై విమర్శలు ఎక్కువయ్యాయి. చూస్తుంటే.. కావాలనే.. చిత్రబృందం ఇలాంటి పాట విడుదల చేసిందా? అనే అనుమానాలు వ్యాపిస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’కి కూడా ఇంతే. ముద్దు పోస్టర్లతోనూ, ఆడియో ఫంక్షన్లో విజయ్ స్పీచులతోనూ వేడి పుట్టింది. అలా… అలా ఆ సినిమా ప్రమోషన్లు పెరిగాయి. ఓపెనింగ్స్ అదిరాయి. సరిగ్గా అదే ఫార్ములా నమ్ముకుందేమో గీత గోవిందం టీమ్.