విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవిత రాజశేఖర్ ల కూతురు శివాత్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న దొరసాని సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరైన విజయ్ దేవరకొండ తన తమ్ముడి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒకానొక సమయంలో గొంతు జీర పోయి, స్టేజి పైనే దాదాపు ఏడిచినంత పని చేశారు. వివరాల్లోకి వెళితే..
ఆనంద్ దేవరకొండ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ ఉండేవాడని, అయితే సడన్ గా ఒక రోజు ఫోన్ చేసి తాను ఇండియాకు వచ్చేసి సినిమాల్లో నటిస్తానని చెప్పినప్పుడు తనకు ఆ విషయం నచ్చలేదని, ఎంతో కష్టపడి చదువుకుని ఎంతో ఇష్టపడి అమెరికాకు వెళ్లి ఇప్పుడు తిరిగి ఇండియా కు వచ్చేస్తాను అనడం తనకు నచ్చలేదని, కానీ ఆనంద్ దేవరకొండ అప్పటికే ఫిక్స్ అయిపోయి ఉన్నాడని అందుకే ఇంకేమీ చెయ్యలేక సరేనని అన్నానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. తన వైపు నుండి ఏ మాత్రం సపోర్ట్ లేకపోయినా, ఆనంద్ స్వయంగా కానీ యాక్టింగ్ లో శిక్షణ తీసుకుని, సొంత సేవింగ్స్ ఖర్చు పెట్టుకుని అనేక రకాల ట్రైనింగ్ తీసుకుని ఈ సినిమా తో నటుడిగా మారాడని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. అయితే అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ ఉద్యోగం చేస్తూ కుటుంబానికి డబ్బు పంపుతూ ఉండేవాడిని, అప్పటికి తాను సెటిల్ కాలేదని, ఆ సమయంలో కుటుంబం కోసం ఆనంద్ డబ్బు పంపుతూ కుటుంబం కోసం కష్టపడటం వల్లే ఇవాళ తాను కూడా ఈ స్థాయిలో ఉన్నా అని చెబుతూ విజయ్ దేవరకొండ భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబం కోసం ఆనంద్ దేవరకొండ అప్పట్లో ఎంతో త్యాగం చేసాడని అంటూ ఎంతో ఎమోషనల్ గా విజయ్ దేవరకొండ మాట్లాడుతుండగా, ఆనంద్ దేవరకొండ కి, వారి తల్లి కి కూడా కళ్ళు చెమ్మగిల్లి పోయాయి.
అయితే తను ఈ సినిమా చూశాను అని, మొదటి ప్రయత్నం కదా ఏమాత్రం చేసుంటారో అనుకుంటూ సందేహిస్తూ చూశానని, కానీ హీరో హీరోయిన్లు ఇద్దరూ చాలా అద్భుతంగా నటించేశారని విజయ్ దేవరకొండ కితాబిచ్చాడు. జూలై 12 న విడుదల కానున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది వేచి చూడాలి.