విజయ్ దేవరకొండ కెరీర్లో పెద్ద దెబ్బ… ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విజయ్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు. ‘వాట్ లగాదేంగే..’ అంటూ విడుదలకు ముందు స్పీచులు అదరగొట్టాడు. మీ సినిమా ఎంత వసూలు చేస్తుంది? అని అడిగితే ‘నా కౌంట్ 2 వందల కోట్ల నుంచి స్టార్ట్ చేస్తున్నా’ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. తన సినిమాపై కాన్ఫిడెన్స్ ఉండడం ఓకే, కానీ విజయ్ వ్యవహారం మరీ టూమచ్ అనిపించింది. సినిమా ఫ్లాప్ అయిన తరవాత విజయ్ ఇచ్చిన బిల్డప్పులు గుర్తొచ్చి జనం నవ్వుకొన్నారు. ట్రోల్ చేశారు. ఇవన్నీ విజయ్‌కి గుర్తున్నాయి. ఎక్కడ తగలాలో, అక్కడ తగిలాయి,. అందుకే ఇప్పుడు ఓ నిర్ణయం తీసుకొన్నాడు. తన సినిమా గురించి ఎక్కువ హైప్ ఇవ్వకూడదని, సినిమా విడుదలకు ముందే ‘పొడిచేస్తుంది, చింపేస్తుంది’ లాంటి మాటలు మాట్లాడకూడదన్న రియలైజేషన్‌కి వచ్చాడు.
”లైగర్‌పై చాలా నమ్మకం పెట్టుకొన్నా. అందుకే అంత కాన్ఫిడెన్స్‌గా మాట్లాడాను. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమాతో ఓ విషయం నేర్చుకొన్నా. సినిమాకి ముందు ఏం మాట్లాడకూడదు. విడుదలైన తరవాతే నోరు విప్పాలి.. ఈ విషయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకొన్నా. ఇది నాకు నేను విధించుకొన్న శిక్ష” అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా.. ఇది మంచి నిర్ణయమే. ఈ రియలైజేషన్ విజయ్లోనే కాదు, ఇంకొంతమంది యంగ్ హీరోల్లోనూ రావాల్సివుంది. సినిమా గురించి జనాలు మాట్లాడుకోవాలి. వసూళ్లు చెప్పాలి. అంతేకానీ, విడుదలకు ముందే సెల్ఫ్ డబ్బా కొట్టుకొంటే, అంచనాలు పెరుగుతాయి. ఆ తరవాత ఫలితం తేడా వస్తే.. జనాలు కూడా నవ్వుకొంటారు. అందుకే ఈ విషయంలో విజయ్ మారాడు. ‘ఫ్యామిలీస్టార్’ ప్రమోషన్లలో విజయ్ చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. కానీ.. తన సినిమా గురించి హైప్ పెంచే విషయాలు ఏం మాట్లాడడం లేదు.