ఇది వరకు స్టార్ హీరోలకే బ్రాండ్ వాల్యూ ఉండేది. వాళ్లనే బ్రాండ్ అంబాసిడర్లుగా తీసుకోవడానికి సంస్థలు పోటీ పడేవి. ఇప్పుడు యూత్ హీరోలు కూడా పోటీకొచ్చేశారు. వీళ్లలో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉన్నాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్ కి ఇప్పుడు మార్కెట్ లో భలే వాల్యూ ఉంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, కే ఎల్ యమ్ లాంటి సంస్థలకు తనే బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ కళ్లు కూడా విజయ్ దేవరకొండని లాగేసింది. సౌత్ ఇండియా నుంచి ఫ్లిక్ కార్ట్ అంబాసిడర్లుగా సమంత, దుల్కర్ సల్మాన్‌లతో పాటు, విజయ్ దేవరకొండని కూడా ఎంచుకుంది. ఈ ఒప్పందం విలువ కోటి రూపాయలు. ఇక నుంచి విజయ్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవాలంటే… మినిమం కోటి రూపాయలు సమర్పించుకోవాల్సిందే. మరోవైపు ఒకొక్క సినిమాకి రూ.6 నుంచి రూ.8 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నాడు. ఓవైపు సినిమాలు, మరోవైపు బ్రాండ్లు… రెండు చేతులా సంపాదన అంటే ఇదే.