విజయ్‌దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం తరవాత.. వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి, పరశురామ్ ప్రస్తుతం స్క్రిప్టుని టైట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మరోవైపు హీరోయిన్ కోసం అన్వేషణ మొదలైంది. విజయ్ కోసం మూడు ఆప్షన్లు రెడీగా ఉన్నాయి.
మొదటి ఆప్షన్ పూజా హెగ్డే. విజయ్‌తో పూజా ఇంత వరకూ సినిమా చేయలేదు. కాంబో కూడా చూడ్డానికి ఫ్రెష్‌గా బాగుంటుంది. సో.. పూజా వైపు చిత్రబృందం మొగ్గు చూపుతోంది. కాకపోతే.. పూజా రెమ్యునరేషన్ చాలా ఎక్కువ. దాని గురించే దిల్ రాజు ఆలోచనలో పడ్డారు. పైగా.. ఎంతిచ్చానా పూజా డేట్లు దొరకడం ఈరోజుల్లో కష్టంగా మారింది.
రెండో ఆప్షన్.. మృణాల్ ఠాకూర్. `సీతారామం`తో ఆకట్టుకొంది ఈ భామ. అప్పటి నుంచీ తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నానితో ఓ సినిమా చేస్తోంది. పూజా కంటే.. మృణాల్ రెమ్యునరేషన్ చాలా తక్కువ. విజయ్ తో కూడా తన జోడీ బాగుంటుంది. అందుకే.. మృణాల్ ని ఎంచుకొంటే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో ఉంది చిత్రబృందం.
ఇక మూడోది.. ముఖ్యమైన ఆప్షన్.. రష్మిక. గీత గోవిందంతో విజయ్ – రష్మిక కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఆ తరవాత డియర్ కామ్రేడ్ లోనూ ఈ జంట మెప్పించింది. ఈ సినిమా చేస్తే.. హ్యాట్రిక్ కాంబో అవుతుంది. పైగా.. విజయ్ – రష్మికల మధ్య ఏదో నడుస్తోందన్న ఊహాగానాలు ఈమధ్య బాగా వినిపిస్తున్నాయి. మరోసారి కలిసి నటించారంటే.. కాంబో పరంగా సినిమాకి కొత్త గ్లామర్ అబ్బినట్టే. పైగా పరశురామ్ కూడా రష్మికే కావాలని గట్టిగా అడుగుతున్నాడట. సెంటిమెంట్ పరంగా తనకు వర్కవుట్ అవుతుందని ఆశ. అన్నీకుదిరితే.. రష్మికనే ఈ సినిమాలో హీరోయిన్ అయ్యే ఛాన్సుంది. మరి.. ఈ మూడు ఆప్షన్లలో చివరికి ఏది ఫైనల్ అవుతుందో చూడాలి.