లైగర్, జనగణమన… ఇలా వరుసగా రెండు సినిమాలతో పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండల ప్రయాణం దిగ్విజయంగా సాగుతోంది. ఈ బంధం రెండు సినిమాలతోనే పరిమితం కాదు. ముచ్చటగా మూడో సినిమా కూడా ఈ కాంబినేషన్లో రాబోతోందన్న విషయం… తెలుగు 360 ముందే చెప్పింది. జనగణమన చివరి దశలో.. ఈ హ్యాట్రిక్ సినిమాకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వస్తుంది. అయితే… ఈ సినిమా నేపథ్యం గురించి ఓ ఆసక్తికరమైన అంశం.. బయటకు వచ్చింది. విజయ్ కోసం.. పూరి ఇప్పుడు ఓ సోషియో ఫాంటసీ కథని తయారు చేశాడట. అది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘యమదొంగ` జోనర్లో సాగుతుందని సమాచారం. పూరి ఇలాంటి కథ రాయడం ఇదే తొలిసారి. విజయ్ దేవరకొండ కూడా ఇది వరకు ఈ జోనర్ ట్రై చేయలేదు. సో.. వీరిద్దరికీ ఇది కొత్త కథే!
పూరి దగ్గర కథలకు లోటు ఉండదు. ఆయన దగ్గర బౌండెడ్ స్క్రిప్టులు 50 వరకూ ఉన్నాయి. అందులో… ఇదొకటి. ‘లైగర్’ జరుగుతున్నప్పుడు ‘జనగణమన’ కథ చెప్పి విజయ్ దేవరకొండని ఇంప్రెస్ చేశాడు పూరి. ఇప్పుడు ‘జనగణమన’ చేస్తున్నప్పుడే ఈ సోషియో ఫాంటసీ కథ చెప్పి మరోసారి ఓకే చేయించుకొన్నాడట. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకక్కించనున్నారని తెలుస్తోంది.