విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో `లైగర్` పూర్తయ్యింది. వెంటనే `జగనణమన`ని కూడా మొదలెట్టేశారు. ఈ సినిమాలో విజయ్ సైనికుడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సైనికుడి సినిమా అంటే.. సరిహద్దులో పోరాటాలు, యుద్ధం.. ఇవే ఉంటాయనుకుంటారు. కానీ ఇది పూరి జగన్నాథ్ సినిమా కదా? అంతకు మించి ఎక్కువే ఆలోచించాడు. ఈ సినిమాలో సమకాలీన రాజకీయాలకు పెద్ద పీట వేశాడట పూరి. ఈ దేశంలో మిలట్రీ రూల్ వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ పై ఈ సినిమా నడబోతోందని తెలుస్తోంది.
దేశంలోని రాజకీయ వ్యవస్థ పూర్తిగా బ్రష్టు పట్టుకొని పోయినప్పుడు… మిలట్రీ ఎలా స్పందించాలి? ఈ దేశ పాలనా వ్యవస్థని చేతుల్లోకి తీసుకొని, పరిపాలిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టుకొచ్చింది. అంటే ఈ దేశాధినేతగా.. విజయ్‌ని చూడబోతున్నామన్నమాట. ఇది వరకు `నోటా` అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటించాడు విజయ్. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈసారి పూరి ఏం చేస్తాడో? పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఇది వరకు ఈ కథని చాలామందికి చెప్పాడు. కానీ కుదర్లేదు. విజయ్‌తో తన కలని ఇలా సార్థకం చేసుకుంటున్నాడు.