అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం రూ.100 కోట్ల మైలు రాయిని చేరుకోవడంతో అతని స్టార్ డమ్ మరింత పెరిగింది. మార్కెట్ మూడింతలైంది. ఇప్పుడు విజయ్ పారితోషికం రూ.10 కోట్ల వరకూ ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తనతో సినిమాలు చేయడానికి బడా నిర్మాతలు, దర్శకులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి ఛాన్సు మారుతికి దక్కినట్టు సమాచారం. యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయడానికి విజయ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే సంస్థతో మారుతి ఓ సినిమా చేయాల్సివుంది. అందుకే ఈ ఇద్దరికీ జోడీ కుదిరిందని టాక్. ప్రస్తుతం శైలజారెడ్డి అల్లుడు తో బిజీగా ఉన్నాడు మారుతి. ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. దానికితోడు.. మారుతి ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో దిట్ట. `గీత గోవిందం`లో విజయ్ దేవరకొండ టైమింగ్ భలేగా పండింది. అందుకే.. వీరిద్దరి కాంబినేషన్ కచ్చితంగా మంచి ఫలితాల్ని తీసుకొస్తుందని యూవీ క్రియేషన్స్ నమ్ముతోంది. 2019 ప్రధమార్థంలో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది.