‘అర్జున్ రెడ్డి’ సినిమా చాలామంది కెరీర్లను మార్చేసింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఓ స్టార్ అయిపోయాడు. షాలినీ పాండేకీ బాగానే పేరొచ్చింది. అవకాశాలూ చేజిక్కించుకుంది. ఈ సినిమా రీమేక్‌తోనే సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో అడగుపెట్టేశాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు.
అర్జున్ రెడ్డి కథ పరంగా, టేకింగ్‌పరంగా, క్యారెక్టరైజేషన్స్పరంగా.. షాక్ ఇచ్చింది. అందులో విజయ్ దేవరకొండ – షాలినీ పాండే పెట్టుకున్న ముద్దుల గురించి కూడా పెద్ద చర్చే నడిచింది. వీరిద్దరి కెమిస్ట్రీ ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ జత కట్టబోతున్నారు. విజయ్ – షాలినీ మరోసారి వెండి తెరపై సందడి చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. ఆనంద్ అన్నామలై దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో కథానాయికగా షాలినీ పాండే ని ఎంచుకున్నారని తెలుస్తోంది. మరో నాయిక మాళవిక మోహన్ అనే మలయాళీ భామ పరిచయం అవుతోంది. ఈ చిత్రంలో విజయ్ ఓ బైక్ రేసర్‌గా కనిపించబోతున్నాడట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి.