విజయ్ దేవరకొండ నటనలోనే కాదు, మాటల్లోనూ ఓ మ్యాజిక్ ఉంటుంది. తన స్టేట్మెంట్లతో సినిమాకి హైప్ తీసుకురావడంలో సిద్ధహస్తుడు. తనపై వచ్చిన ట్రోలింగ్‌లను సైతం సినిమా పబ్లిసిటీలో వాడుకునేంత తెలివితేటలు కలవాడు. నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలు ఫ్లాపులైనా – ఆయా సినిమాలకు సంబంధించిన విజయ్ స్పీచులు వింటే మెంటలెక్కిపోతుంది. `ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు` అనిపిస్తుంటుంది.
అయితే `వరల్డ్ ఫేమస్ లవర్` సినిమా విషయంలో విజయ్ ఇస్తున్న స్పీచులు చూస్తే నీరసంగా కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న `ఇదే నా ఆఖరి ప్రేమకథ` అంటూ బాంబు పేల్చాడు. ఆ స్టేట్మెంట్ వల్ల ఈ సినిమాని నెగిటీవ్ మైలేజీ రావడం మొదలైంది. `ఎన్నో సినిమాలు, మరెన్నో ప్రేమకథలు చేసినట్టు ఇన్ని బిల్డప్పులు ఇవ్వడం ఎందుకు` అంటూ కౌంటర్లు మొదలయ్యాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ.. ఇలాంటి నెగిటీవ్ కామెంట్లే చేశాడు. `నేను ప్రతీ బాలూ సిక్సు కొడదామనే చూస్తాను. ఈ సినిమా కోసం కూడా సిక్సు కొట్టాలనే ప్రయత్నించాను. ఇప్పుడైతే బంతి గాల్లో ఉంది. సిక్సు పోతుందో, క్యాచ్ అవుతుందో` అంటూ మాట్లాడాడు. తన స్పీచులో ఈ సినిమాపై ఎక్కడా నమ్మకం ఉన్నట్టు కనిపించడం లేదు. సరికదా.. సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టు వ్యవహరిస్తున్నాడు విజయ్. ఇది వరకటి కాన్ఫిడెన్స్ ఇప్పుడు విజయ్‌లో కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. `డియర్ కామ్రేడ్` ఇచ్చిన షాక్ వల్ల ఇలా మారాడా? తన మాటలతో సినిమాపై హైప్ తీసుకురాకూడదని భావిస్తున్నాడా? లేదంటే అసలు సినిమాలోనే విషయం లేదని అర్థమైపోయిందా.. ? ఇలా రకరకాల అనుమానాలు, అపనమ్మకాలు. కాకపోతే.. దర్శక నిర్మాతలకు మాత్రం విజయ్ వైఖరి బొత్తిగా నచ్చడం లేదు. ఇలాంటి నెగిటీవ్ కామెంట్ల వల్ల సినిమా రిజల్ట్ తేడా కొడుతుందని భయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.