ఓ హీరో కోసం రాసుకున్న కథని మరో హీరోతో పట్టాలెక్కించడం సర్వ సాధారణంగా జరిగే విషయం. ఈమధ్య… ఇలాంటి సందర్భాలే ఎక్కువ. అయితే… హీరోలు మారినా, వాళ్ల ఏజ్లూ… ఇమేజ్‌లూ లెక్కలోకి తీసుకోవాలి. యంగ్ హీరో కోసం ఓ కథ రాసి – సీనియర్ హీరో దగ్గరకు వెళ్లి ఒప్పించడం మామూలు విషయం కాదు. అలాంటి సందర్భాలు చాలా తక్కువ. ఆ ఫీట్ ని సాధించాడు బాబి.
`వెంకీ మామ` తరవాత బాబీ ఖాళీ. కాకపోతే కథ పట్టుకుని తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. విజయ్ దేవరకొండ కోసం ఓ కథ రాసుకున్నాడు బాబీ. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. కానీ విజయ్ తనకున్న బిజీ వల్ల – బాబి కథని యాక్సెప్ట్ చేయకలేపోయాడు. ఆ వెంటనే చిరుతో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు. చిరు కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. చిరు – బాబీ కాంబినేషన్ అనగానే ఎవ్వరూ నమ్మలేదు. సెట్స్‌పైకి వెళ్లేంత వరకూ డౌటే.. అనుకుంటున్నారు. కానీ.. ఈ కథ ఓకే అయిపోయింది. ఈకథకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇందులో చిరుది డ్యూయల్ రోల్ అనే వార్తలొస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే… విజయ్ కోసం బాబి అనుకున్న కథ ఇదేనట. కొన్ని మార్పులూ చేర్పులతో చిరుకి వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. విజయ్ దేవరకొండ – చిరు… ఇద్దరి స్థాయి వేరు. ఇమేజ్ వేరు. అలాంటిది ఒకరి కథని మరొకరితో సెట్ చేశాడంటే బాబీ మామూలోడు కాదు.