Vijay GOAT Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
స్టార్ హీరోలతో సినిమా అనేది అంత ఈజీ కాదు. అభిమానుల్ని మెప్పించాలి. హీరో ఇమేజ్‌కి మ్యాచ్ అయ్యేలా కథలు రాసుకోవాలి. దాంతో పాటు దర్శకుడి సృజన, మార్క్ అక్కడక్కడ చూపించాలి. ఈ కొలతల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఓ గొప్ప అవకాశం చేజారిపోతుంది. కొన్ని కొన్నిసార్లు తమ మార్క్ ని కూడా త్యాగం చేసి, కేవలం ఫ్యాన్స్ ని మెప్పిస్తే చాలు అని కొంతమంది దర్శకులు అనుకొంటారు. అది సేఫ్ గేమ్. సినిమా కనీసం ఓ వర్గానికైనా చేరువ అవుతుందన్న భరోసా అది. వెంకట్ ప్రభు అదే చేశాడు. ఈ దర్శకుడి ఖాతాలో ఎన్నో మంచి సినిమాలున్నాయి. స్క్రీన్ ప్లేతో ఓ ఆట ఆడుకోగల దర్శకుడు అనే పేరుంది. ‘మానాడు’ అందుకు అత్యుత్తమ ఉదాహరణ. అలాంటి దర్శకుడికి విజయ్ లాంటి స్టార్ దొరికాడు. తన తెలివితేటలు ఏమాత్రం వాడకుండా, కేవలం విజయ్ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేస్తూ, వెంకట్ ప్రభు ఓ సినిమా తీస్తే అదెలా ఉంటుంది? అని చెప్పుకోవడానికి ‘గోట్’ ఓ ఉదాహరణలా నిలుస్తుంది.
గాంధీ (విజయ్) యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌లో పని చేస్తుంటాడు. ఈ సంగతి తన భార్య (స్నేహ)కు కూడా తెలీదు. ఓ మిషన్‌లో భాగంగా బ్యాంకాక్ వెళ్తాడు. తనతో పాటు భార్యనీ, కొడుకు జీవన్ని తీసుకెళ్తాడు. అయితే అక్కడ జీవన్ ని ఎవర్ కిడ్నాప్ చేసి చంపేస్తారు. ఆ కోపంలో భార్య గాంధీకి దూరం అవుతుంది. గాంధీ స్వ్కాడ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ ఆఫీసర్‌గా పని చేస్తుంటాడు. కొన్నేళ్ల తరవాత ఆఫీస్ పనిమీద రష్యా వెళ్తాడు గాంధీ. అక్కడ అచ్చం తనలానే ఉన్న (విజయ్) ఓ పాతికేళ్ల కుర్రాడిని చూస్తాడు. అతనెవరు? చిన్నప్పుడు చనిపోయిన జీవన్ మళ్లీ తిరిగొచ్చాడా? వచ్చాక గాంధీ కథ, తన వృత్తి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అనేదే ఈ ‘గోట్’.
కెన్యాలో జరిగిన ఓ భారీ మిషన్‌తో కథ మొదలవుతుంది. అక్కడ యంగర్ వెర్షన్ ఆఫ్ విజయ్‌కాంత్ ని ఏఐ సాయంతో తీసుకొచ్చారు. యాక్షన్ సీన్ పెద్దగా వర్కవుట్ అవ్వకపోయినా, ఆ సీన్ కథకు మూలం. ఆ తరవాత కథ.. ఆలు – మగల డ్రామాగా మారిపోతుంది. స్నేహతో నడిచే సన్నివేశాలు, అక్కడ చేసిన కామెడీ అంతగా మెప్పించలేదు. బ్యాంకాక్ వెళ్లాక కథ మళ్లీ గాడిన పడుతుంది. అక్కడ జరిగిన ఓ ఛేజ్, కొడుకు కిడ్పాప్ అవ్వడం, చివరకు దూరం అవ్వడం, ఆ ఘటన భార్యా భర్తల మధ్య అగాధాన్ని తీసుకురావడం..ఈ సన్నివేశాలు కాస్త సెటిల్డ్ గా నడుస్తాయి. రష్యాలో మళ్లీ జీవన్ కనిపించం నుంచి కథ మరింత రక్తి కట్టాలి. కానీ అక్కడి నుంచి కనీసం 20 నిమిషాల డ్రామా చాలా బోరింగ్ గా నడుస్తుంది. కొత్త సాంకేతిక సహాయంతో పాతికేళ్ల విజయ్‌ని తెరపైకి తీసుకురావడం అనే ఐడియా బాగానే ఉన్నా, ఎందుకో ఆ గెటప్ చాలా కృత్రిమంగా అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే సాంకేతికత ఫెయిల్ అయ్యిందో, ఆ పాత్రని ఫాలో అవ్వడం కష్టం అవుతుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ లో ఓ ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. కానీ… ఈ పేట్రన్ సినిమాలు ఫాలో అయ్యేవాళ్లకు ఆ ట్విస్ట్ ఊహించడం పెద్ద కష్టమేం కాదు. ఫస్టాఫ్‌లో అక్కడక్కడ కొన్ని మాస్ మూమెంట్స్ తప్ప… పెద్దగా చెప్పుకోవడానికి ఏం ఉండదు. ఇదో `రా` ఏజెంట్ కథ కంటే.. కొడుకుకు దూరమైన తండ్రి కథగానే చూడాల్సివస్తుంది.
తొలి సగం ఎప్పుడైతే యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోయిందో, అప్పుడే ద్వితీయార్థంపై భారం పడిపోయింది. అక్కడ ఏదో ఓ మ్యాజిక్ చేస్తే తప్ప ఈ సినిమా గట్టెక్కలేదు. దర్శకుడు ఆ ప్రయత్నాలు చేశాడు. సైకో విలనిజం తరహా పాత్రని ప్రవేశ పెట్టి, తనతో వరుస హత్యలు చేయించి కథలో థ్రిల్లింగ్ మూమెంట్స్ తీసుకురావాలని తపన పడ్డాడు. దురదృష్టం ఏమిటంటే ఆ వంటకం కూడా అంతంత మాత్రంగానే సాగింది. జీవన్ పాత్రని హైలెట్ చేయాలన్న ఉద్దేశంతో గాంధీని మరీ డల్ గా చేసేశాడు. గాంధీ ఎక్కడా రా ఏజెంట్ లా కనిపించడు. అతని ఆలోచనలు, ఎత్తుకు పై ఎత్తులూ అన్నీ సాధారణంగానే ఉంటాయి. ఆ మాత్రం దానికి గాంధీని ‘రా ఏజెంట్‌గా’ చూపించాల్సిన అవసరం ఏముంది? చివర్లో రెండు మూడు ట్విస్టులు అట్టిపెట్టుకొన్నాడు వెంకట్ ప్రభు. అందువల్ల సినిమా బోరింగ్ గా అనిపించదు. అలాగని సీట్లకు అతుక్కొని కూర్చోబెట్టేంత ఉత్కంఠత కూడా కనిపించదు. త్రిష వచ్చి చిందులేయడం ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. అయితే ఆ పాటలో ఊపు లేదు. స్టేడియం బ్యాక్ డ్రాప్లో క్లైమాక్స్ తెరకెక్కించారు. ఓ పక్క మ్యాచ్, మరో వైపు ఫైట్. ధోనీ వల్ల, శివ కార్తికేయన్ గెస్ట్ రోల్ వల్ల.. క్లైమాక్స్ కి కాస్త ఉత్సాహం వచ్చింది. ఇదంతా చాలదన్నట్టు పార్ట్ 2 రాబోతోందని ఓ హింట్ ఇచ్చారు. మరో ఇద్దరు విజయ్‌లను చూపించి ప్రేక్షకుల్ని ఇంకాస్త కన్ఫ్యూజన్కు గురి చేశారు.
విజయ్ ఎప్పటిలానే తన పాత్రని చాలా ఈజ్‌తో చేసుకెళ్లిపోయాడు. ముసలి గెటప్ ఎంత ఓవర్ అయ్యిందో, కుర్రాడి గెటప్ అంతకంటే టూమచ్ అయ్యింది. ఇలాంటి సాంకేతికత వాడడం ఇదే ప్రధమం కాబట్టి కాస్త సర్దుకుపోవాలి. ఓ పాటలో డాన్సు అదరగొట్టాడు. ఆ పాట సందర్భం లేకుండా వచ్చినా, ఫ్యాన్స్ కు విజయ్ ఇచ్చిన ట్రీట్ అనుకోవాలి. స్నేహ పాత్ర పరిధి తక్కువే. మీనాక్షి చౌదరికి రెండు మూడు డైలాగులు కూడా ఇవ్వలేదు. విజయ్ పక్కన డాన్స్ చేస్తే చాలనుకొని ఈ సినిమా ఒప్పుకొని ఉంటుంది. ప్రభుదేవా, ప్రశాంత్, జయరామ్ తమ పరిధి మేర ఆకట్టుకొన్నారు. వెంకట్ ప్రభు సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే ప్రేమ్ జీ, వైభవ్ ఈ సినిమాలోనూ మెరిశారు. యోగిబాబు ట్రాక్ అంతగా వర్కవుట్ అవ్వలేదు.
కథగా ‘ది గోట్’లో పెద్దగా మేటర్ లేదు. రెండు మూడు ట్విస్టుల్ని, విజయ్‌నీ నమ్ముకొని తీసిన సినిమా ఇది. స్క్రీన్ ప్లేలో మెరుపులు కనిపించలేదు. ‘ది గోట్: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే టైటిల్ ఇంత బలహీనమైన కథకు ఎందుకు పెట్టారో అర్థం కాదు. యువన్ పాటలు తెలుగు వరకూ ఎక్కడం కష్టం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాలి. కనీసం 20 నిమిషాలైనా ట్రిమ్ చేయొచ్చు అనిపిస్తుంది. ‘ది గోట్‌ని’ ప్రేక్షకులు ఇంటిలిజెంట్ డ్రామాలోనో, ఓ రా ఏజెంట్ కథలానో ఊహించుకొని థియేటర్లకు వెళ్తే నిరుత్సాహ పడతారు. ఓ మామూలు మాస్, కమర్షియల్ సినిమా అనుకొని చూడాలి. అది కూడా విజయ్ కోసం.
తెలుగు360 రేటింగ్: 2.75/5