భారతీయ క్రికెటర్లు వివాదంలో ఇరుక్కోకుండా తృటిలో తప్పించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న కోహ్లీ బృందం పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌ను ఆదివారం మాల్యా చూశారు. అనంతరం సోమవారం నాడు విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ఇచ్చిన విందుకూ ఈ రుణాల ఎగవేతదారు హాజరయ్యారు. ఇక్కడే వివాదం తలెత్తకుండా ఇండియన్ టీమ్ జాగ్రత్త పడింది. కోహ్లీ సహా మొత్తం ఆటగాళ్ళందరూ విందునుంచి తొందరగా నిష్క్రమించారు. బర్మింగ్‌హామ్ క్రికెట్ మైదానంలో మాల్యా కనిపించినప్పుడే కలకలం రేగింది. విఐపీ విభాగంలో కూర్చుని ఆయన పాక్‌తో మ్యాచ్‌ను తిలకించారు. విజయ్ మాల్యాను భారత్‌కు తిరిగి తీసుకొచ్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఈ సమయంలో ఆర్థిక నేరాల కేసులో నిందితుడైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమానితో ముఖాముఖి ఎదురైనా.. మాట కలిపినా భారత జట్టుకు ఇబ్బందే. అందుకే జట్టు ఆ పరిస్థితి ఎదురుకాకుండా తప్పించుకుంది.
ఇదే సమయంలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ విజయ్ మాల్యాతో కలిసి కనిపించారు. ఫహీమ్ అనే ప్రముఖుడు వారిద్దరినీ ఫొటో తీసి, తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఆ సమయంలో గవాస్కర్‌కు పాప్ కార్న్ కొనేందుకు మాల్యా తన మొబైల్ ద్వారా పేటీఎంలో డబ్బులు చెల్లిస్తూ కనిపించారు. ఆ ప్రక్రియను గవాస్కర్ ఆసక్తిగా గమనిస్తున్నట్లు చిత్రంలో ఉంది. ఈ చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. మాల్యాతో మాట్లాడినందుకు గవాస్కర్‌పై ఎటువంటి విమర్శలు వస్తాయో చూడాల్సిందే.
కోహ్లీ గానీ అతని ఫౌండేషన్ గానీ మాల్యాను విందుకు ఆహ్వానించలేదని బీసీసీఐ ప్రతినిధి చెబుతున్నారు. ఒక ఛారిటీ డిన్నర్‌ను ఏర్పాటు చేసినప్పుడు టేబుల్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి మాల్యాను ఆహ్వానించి ఉండవచ్చు. ఆయన్ను ఎవరూ కాదనలేరు కదా అని వివరణిచ్చారని పిటిఐ వార్తా సంస్థ కథనం. భారత జట్టు సౌకర్యంగా ఉంది. మాల్యాతో దూరం పాటించి, హుందాతనాన్ని నిలబెట్టుకుందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఈ స్థితిని ఎవరూ ఊహించలేదు. తప్పించుకోలేరు. మాల్యాను వెళ్ళిపోమని చెప్పలేం కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. ఎస్బీఐ, పిఎన్బీ, ఐడీబీఐ, బీఓబీ అలహాబాద్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులకు మాల్యా మొత్తం 9వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టారు. అవి కట్టాల్సి వస్తుందని లండన్‌కు చెక్కేశారు. గతంలో ఆయన బీసీసీఐ జట్టును స్పాన్సర్ చేశారు. ఐపీఎల్లో కూడా ఒక జట్టును కొనుగోలు చేశారు. క్రికెట్‌తో ఆయనకున్న సంబంధాలే మాల్యాను ఈ విందుకు ఎవరో ఆహ్వానించేలా చేసుంటాయి. అక్కడ అంతర్గతంగా ఏమీ జరిగి ఉండకపోవచ్చు. జరిగుంటే సంబంధిత క్రికెటర్ ఇబ్బందుల్లో పడటం ఖాయం. గవాస్కర్‌పై ఎటువంటి చర్య ఉంటుందో వేచి చూడాల్సిందే.
సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి