చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఫలితం ఉండదు. ఘరానా మోసగాడు విజయ్ మాల్యా ఐదేళ్లుగా అప్పులు ఎగ్గొట్టి జల్సాలు చేస్తున్నా చేతులు ముడుచుకుని కూర్చున్న బ్యాంకులు ఇప్పుడు తెగ హడావుడి చేస్తున్నాయి. మాల్యాకు అందరికంటే ఎక్కువగా రూ. 1600 కోట్ల రుణాన్ని ఉదారంగా సమర్పించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అతడిని విల్ ఫుల్ డిఫాల్టర్ అని ప్రకటించడానికి మూడేళ్లు పట్టింది. దీనికి కారణం భయమో మరేంటో అర్థం కాదు. మొత్తానికి గురువారం నాడు ముంబైలోని కింగ్ పిషర్ హౌస్ అనే భవంతిని ఎస్ బి ఐ వేలం వేసింది. దీని విలువ రూ. 150 కోట్లుగా లెక్కించి ఇ ఆక్షన్ జరిపింది. ఈ వేలం త్వరగానే ముగిసింది. అంటే, వందల కోట్ల రూపాయల్లో కనీసం 150 కోట్లు సదరు బ్యాంకుకు దక్కడం ఖాయమైంది.
వడ్డీతో కలిసి 17 బ్యాంకులకు 9 వేల కోట్ రూపాయలు పైగా బాకీ పడ్డ విజయ్ మాల్యా లండన్ లోని తన కంట్రీ ప్యాలెస్ లో ఖుషీగా ఉన్నాడు. ఇప్పట్లో రానని పైకి చెప్పినా ఎప్పటికీ రావాలనే ఉద్దేశం లేదనేది అతడి ప్రవర్తనే చెప్తుంది. అడుగడుగునా బ్యాంకుల, ప్రభుత్వ నిర్లక్స్యానికి ఈ కేసే ఓ ఉదాహరణ. ఏదో బలమైన కారణం ఉండబట్టే మాల్యా చాలా ఏళ్లుగా పైసా వడ్డీ కట్టకుండా సతాయిస్తున్నా బ్యాంకులు కిమ్మనలేదు. కనీసం ఉద్దేశ పూర్వక ఎగవేత దారుగా ప్రకటించడానికి కూడా మీనమేషాలు లెక్కించాయి. అలా ప్రకటిస్తే అతడికి కోపం వస్తుందేమో అని భయపడ్డాయనే అనుమానాలు కలగడం సహజం. రెండేళ్ల కిందట ఎస్ బి ఐ చైర్మన్ ను బాహాటంగా ట్విటర్లోనే మాల్యా ఖబడ్దార్ అని బెదిరించినంత పని చేశాడు.
సీబీఐ లుకౌట్ నోటీసు కూడా సరైన విధంగా లేకుండా చేయడం వెనుక రాజకీయ కోణం కచ్చితంగా ఉండొచ్చు. బ్యాంకులు నిద్రపోతుంటే హెచ్చరించాల్సిన కేంద్ర ఆర్థిక శాఖ కూడా నిద్ర నటించింది. బ్యాంకుల సొమ్ము అంటే ప్రజాధనం. దానికి కాపలాగా, జవాబు దారీగా ఉండాల్సిన ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు అడ్డగోలు నిర్లక్ష్యంగా వహించడం ద్వారా మాల్యకు పరోక్షంగా సహకరించాయి. ఇప్పుడు 9 వేల కోట్ల నష్టానికి బాధ్యులు ఎవరు? ఆయా సందర్భాల్లో రుణాలు మంజూరు చేసిన అధికారులా? అంత భారీ మొత్తం రుణం ఇవ్వడానికి అనుమతించిన ఉన్నతాధికారులా? ఇంత పెద్ద స్కాము కళ్ల ముందేకనిపిస్తున్నా చేతులు ముడుచుకుని కూర్చున్న ఆర్థిక శాఖ వారా? ప్రజలకు జవాబు కావాలి. మోడీ ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే. లేకపోతే సర్కారు చిత్తశుద్ధిని కూడా అనుమానించాల్సి వస్తుంది.