బ్యాంకులకి రూ.9,000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోయిన విజయ మాల్యా తనంతట తను వస్తే తప్ప ఆయనని తిరిగి భారత్ రప్పించడం ప్రభుత్వంవల్ల కూడా కాదని తేలిపోయింది. ఆయనకి ప్రభుత్వం, సుప్రీం కోర్టు ఎన్ని హెచ్చరికలు చేసినా ఏమాత్రం ఖాతరు చేయలేదు. మొదట ఆయన పాస్ పోర్ట్ ని ప్రభుత్వం రద్దు చేసింది. తరువాత ఆయన రాజ్యసభ సభ్యత్వం రద్దు చేసింది. ఆయనని వెనక్కి తిప్పి పంపమని బ్రిటన్ ప్రభుత్వానికి లేఖ వ్రాసింది. అయినా ప్రయోజనం లేక పోవడంతో చివరి ప్రయత్నంగా ఆయనని అరెస్ట్ కి వారెంట్ జారీ చేయాలని కోరుతూ ఇంటర్ పోల్ కి లేఖ వ్రాసింది. కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. విజయ మాల్యా చేసిన నేరం గురించి ఈడి అందించిన వివరాలు ఆయనని అరెస్ట్ చేయడానికి సరిపోవని తేల్చి చెప్పింది. బలమైన కారణాలు చూపితే తప్ప అరెస్ట్ వారెంట్ జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఈడి అభ్యర్ధన మేరకు విజయ మాల్యాని ప్రశ్నించడానికి మాత్రం అంగీకరించింది. కానీ దాని వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. ఎందుకంటే నేరం చేసిన వ్యక్తిని ఎప్పుడూ తను నేరం చేసినట్లు చెప్పుకోడు కదా? అయినా ఈడి సమర్పించిన ఆధారాలనే ఇంటర్ పోల్ పరిగణనలోకి తీసుకోనప్పుడు నేరం చేసిన విజయ మాల్యాని ప్రశ్నించి ప్రయోజనం ఏమిటి? ఏదో భారత్ మాట కొట్టేయలేక ప్రశ్నిస్తున్నట్లుంది.
ఇదివరకు మాజీ ఐ.పి.ఎల్. చైర్మన్ లలిత్ మోడీ కూడా తనపై ఆరోపణలు వచ్చినప్పుడు లండన్ పారిపోయారు. రెండేళ్ళు అవుతున్నా ప్రభుత్వం ఆయనని వెనక్కి రప్పించలేకపోయింది. దావూద్ ఇబ్రహీం, మసూద్ అజహర్ వంటి కరడుగట్టిన నేరస్తుల జాబితా చేంతాడంత ఉంది. దశాబ్దాల తరబడి భారత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిలో ఏ ఒక్కరినీ తిరిగి రప్పించలేకపోయింది. అందుకే లలిత్ మోడీ, విజయ మాల్యా వంటివాళ్ళు చాలా ధైర్యంగా మోసాలు చేసి విదేశాలకు పారిపోయి అక్కడ చాలా విలాసవంతంగా జీవించగలుగుతున్నారు. కనుక విజయ మాల్యాని రప్పించడం కూడా అసాద్యమేనని భావించవచ్చు.