ఏకంగా 17 బ్యాంకులకి రూ.9,000 కోట్లు ఎగనామం పెట్టేసి లండన్ పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై ఈడి అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి ఆ కేసు విచారణలో తమ ముందు హాజరుకావలసిందిగా కోరుతూ ఇప్పటికి రెండుసార్లు నోటీసులు పంపారు. ఎట్టి పరిస్థితులలో కూడా ఏప్రిల్ 9వ తేదీన ముంబైలోని తమ విచారణాధికారి ముందు హాజరు కావాలని, లేకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఈడి తన నోటీసులో పేర్కొంది. కానీ విజయ్ మాల్యా ఆ నోటీసులను కూడా ఖాతరు చేయలేదు.
మొదటిసారి నోటీసు పంపినప్పుడు తను ఏప్రిల్ నెలాఖరు వరకు భారత్ తిరిగిరాలేనని సమయం కోరారు. మళ్ళీ నోటీసు అందుకొన్నపుడు తను మే నెలాఖరు వరకు ఈడి ముందు హాజరుకాలేనని చెప్పారు. ‘హాజరు కాలేనని’ ఆయన చెపుతున్నప్పటికీ నిజానికి తను ‘హాజరు కాదలచుకోలేదు’ అని చెప్పినట్లే భావించవచ్చును. ఎందుకంటే చాలా విలసవంతమయిన జీవితం గడిపే విజయ్ మాల్యా, భారత్ తిరిగి వస్తే తనను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారని భయపడుతున్నారు. ఆ భయంతోనే ఆయన లండన్ పారిపోయారు కనుక ఈడి నోటీసులు ఇచ్చిందని ఎగిరుకొంటూ వచ్చి భారత్ లో వాలిపోరు.
సుప్రీం కోర్టు ఆయనకి ఏప్రిల్ 21వరకు గడువు ఇచ్చింది. సుప్రీం కోర్టులో కూడా తన కేసులపై సమాంతరంగా విచారణ జరుగుతోంది కనుక అది పూర్తయ్యేవరకు తను భారత్ తిరిగి రాలేనని ఈడికి మాల్యా చెపుతున్నట్లే భావించవచ్చును. కనుక ఆయనపై ఈడి అరెస్ట్ వారెంటు జారీ చేయవచ్చును. కానీ శివుడు ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదన్నట్లుగా కేంద్రప్రభుత్వం అనుమతించనిదే ఈడి కూడా అరెస్ట్ వారెంట్లు జారీచేయలేదు కనుక ఇప్పుడు బంతి ఏ కోర్టులలో కాక కేంద్రప్రభుత్వం కోర్టులోనే ఉన్నట్లు భావించవచ్చును. ఈడి తదుపరి చర్యలను బట్టి ఆయన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చును.