బ్యాంకులను మోసం చేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా చుట్టూ భారత ప్రభుత్వం మెల్లగా ఉచ్చు బిగిస్తుండటంతో, ఆయన మళ్ళీ మరోమారు ధిక్కార స్వరం వినిపించారు. ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు వింటే ఎవరయినా ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
ఆయన ఏమన్నారంటే “నేనేమీ భారత్ నుంచి తప్పించుకొని పారిపోయి ఇక్కడికి రాలేదు. విధిలేని పరిస్థితులలోనే ఇక్కడ గడపవలసి వస్తోంది. ప్రస్తుతం భారత్ లో పరిస్థితులు పూర్తిగా నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక ఇటువంటి పరిస్థితులలో నేను ఇప్పుడు భారత్ రాలేను. నా వ్యాపారాలలో నష్టాలు రావడం నిజమే కానీ నేను బ్యాంకులకు రూ.9000 కోట్లు బాకీ పడున్నాననే మాట నిజం కాదు. బ్యాంకులే అటువంటి పుకార్లు సృష్టించాయో లేక మీడియా సృష్టించిందో లేక రెండూ కలిసే సృష్టించాయో నాకు తెలియదు కానీ నేను బ్యాంకులకి అంత బాకీ ఉన్నాననే మాట అబద్ధం. భారత్ మీడియాలో నాకు వ్యతిరేకంగా చాలా తీవ్ర ప్రచారం జరుగుతోంది. బహుశః ప్రభుత్వం కూడా ఆ ఒత్తిడికి గురవుతున్నట్లుంది. అందుకే నాపై చర్యలకు సిద్దమవుతున్నట్లుంది.”
ఆయన ఇంకా ఏమి చెప్పారంటే “అయితే నేను ఒక్క విషయం చెప్పదలచుకొన్నాను. నా పాస్ పోర్ట్ ని రద్దు చేసి నన్ను బలవంతంగా అరెస్ట్ చేసి భారత్ రప్పించినా ఫలితం ఉండదు. అప్పుడు బ్యాంకులు నా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా రాబట్టుకోలేవు. నేను కూడా ఈ సమస్య నుంచి బయటపడి మళ్ళీ ప్రశాంతంగా జీవించాలనే కోరుకొంటున్నాను. కానీ ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యమయ్యేలా కనబడటం లేదు. నేను నా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పై సుమారు 600 మిల్లియన్ పౌండ్లు పెట్టుబడి పెట్టాను కనుక దానిని కాపాడుకోవడానికి చివరి వరకు నేను అన్ని రకాల ప్రయత్నాలు చేశాను కానీ దురదృష్టవశాత్తు కాపాడుకోలేకపోయాను. దానికి ప్రభుత్వ పాలసీలు, దేశ ఆర్ధికవ్యవస్థలో ఒడిదుడుకులే కారణం. కానీ నా విలసవంతమయిన జీవన శైలే అందుకు కారణమని భారత్ మీడియా ఆరోపణలు చేయడం దురదృష్టకరం. నిజానికి నేను చాలా నిరాడంబరమయిన జీవితం గడపడానికే ఎక్కువ ఇష్టపడతాను. అయితే నా సంస్థలకు నేనే బ్రాండ్ అంబాసిడర్ వంటివాడిని కనుక దాని కోసం నేను చేసిన ప్రయత్నాలను భారత్ మీడియా వక్రీకరించి నన్నొక విలన్ గా, నా విలాసాల కోసం బ్యాంకుల దగ్గర డబ్బు తీసుకొని వాటిని మోసం చేసి పారిపోయిన నేరస్తుడిగా చిత్రీకరిస్తోంది. కనుక ఈ పరిస్థితులలో నేను భారత్ తిరిగి రాలేను. బలవంతంగా నన్ను వెనక్కి రప్పించినా నా దగ్గర నుంచి బ్యాంకులకు దమ్మిడీ రాలదు,” అని తేల్చి చెప్పారు.
ఆయన కొన్ని రోజుల క్రితమే బ్యాంకులకు తను చెల్లించవలసిన మొత్తం సొమ్మును సెప్టెంబర్ నెలాఖరులోగా రెండు వాయిదాలలో చెల్లిస్తానని సుప్రీం కోర్టుకి తన లాయర్ ద్వారా తెలిపారు. మొదటి వాయిదాగా రూ. 4,000 కోట్లు, మిగిలిన మొత్తాన్ని రెండవ వాయిదాలో చెల్లించడానికి తాను సిద్దంగా ఉన్నానని తెలియజేసారు. అంటే ఆయన బ్యాంకులకు రూ.9,000 కోట్లు బాకీ ఉన్నట్లు అంగీకరించినట్లేనని అర్ధమవుతోంది. కానీ ఇప్పుడు తాను అంత బాకీ లేనని చెపుతున్నారు. అదంతా బ్యాంకులు, మీడియా కల్సి సృష్టించిన పుకార్లేనని చెపుతున్నారు. అంతే కాదు తన పాస్ పోర్ట్ రద్దు చేసినప్పటికీ భారత్ రాదలచుకోలేదని, బలవంతంగా తిరిగి రప్పించినా తన దగ్గర నుంచి పైసా కూడా రాబట్టుకోలేరని చాలా నిర్భయంగా చెపుతున్నారు. ఒక ఆర్ధిక నేరస్తుడు ఇంత ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నా భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోతే, అది ఆయన వంటి ఆర్ధిక నేరస్తులకి ధైర్యం కల్పించినట్లవుతుంది