కాకి పిల్లని చూసి ఎవరూ ముద్దాడరు కానీ తల్లి కాకి ముద్దాడుతుంది ఎందుకంటే అందరికీ తెలుసు. కాకి పిల్ల కాకికి ఎలాగ ముద్దో 17 బ్యాంకులకి 9000 కోట్లు నామం పెట్టేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాకి కూడా తన కొడుకు సిద్దార్థ్ మాల్యా అంటే అంతే ముద్దు…ప్రేమ. అందుకే మీడియాలో తన కొడుకు గురించి వస్తున్న వార్తలను, తిట్లను చూసి సహించలేక మళ్ళీ ట్వీటర్ లో మెసేజ్ రూపంలో దర్శనం ఇచ్చేరు. “నా కొడుకు సిద్ కి నా వ్యాపారాలతో ఎటువంటి సంబంధమూ లేదు కనుక అతనిని అసహ్యించుకోవడం తిట్టడం ఆపండి. కావాలంటే నన్ను తిట్టండి అభ్యంతరం లేదు,” అని విజయ్ మాల్యా మెసేజ్ పెట్టారు.
నిజమే సిద్దార్థ్ కి ఆయన వ్యాపారలావాదేవీలతో సంబంధం లేకపోవచ్చును. కానీ ఆయన ఆస్తులకు అతనే వారసుడయినప్పుడు అప్పులకి కూడా అతనే వారసుడు అవుతాడు. కనుక తండ్రి చేసిన తప్పులకి కొడుకు తప్పేమీ లేకపోయినా కూడా అందరి చేత తిట్లు తినకతప్పదు. అందరూ విజయ్ మాల్యా గురించే చెడ్డగా మాట్లాడుకొంటున్నారు కానీ దేశంలో ఏ టాటాల గురించో, అంబానీల గురించి ఎందుకు చెడ్డగా మాట్లాడుకోవడం లేదు? అంటే వారు చట్టానికి లోబడి వ్యాపారాలు చేసుకొంటున్నారు కనుక. ఇదివరకు విజయ్ మాల్యా బ్యాంకులకు ఎగనామం పెట్టేసి గుట్టు చప్పుడు కాకుండా లండన్ పారిపోయాడని మీడియాలో వార్తలు వచ్చినప్పుడు, ఆయన మీడియాపై ఫెయిర్ అయిపోయారు. “నేను దేశం విడిచి పారిపోలేదు. నేనొక అంతర్జాతీయ వ్యాపారవేత్తను తరచూ దేశ విదేశాలు తిరుగుతుంటాను. వ్యాపార పనుల మీదే లండన్ వచ్చేనని చెప్పుకొన్నారు. కానీ భారత్ లో తన పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది కనుక ఇప్పుడప్పుడే తిరిగి రావాలనుకోవడం లేదని చెప్పారు. అంటే ఆ కారణంగానే ఆయన లండన్ పారిపోయినట్లు అర్ధమవుతోంది. తన కొడుకు గురించి చెడ్డగా మాట్లాడవద్దని, కావాలంటే తనను తిట్టుకోమని చెపుతున్న మాల్యా, తనను తిట్టినా ఊరుకోరని స్పష్టం అవుతోంది. ఒకవేళ అటువంటి పరిస్థితి ఆయన వద్దనుకొంటే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినట్లుగా విజయ్ మాల్యా వెంటనే భారత్ తిరిగి వచ్చి, బ్యాంకుల వద్ద తీసుకొన్న అప్పులన్నీ తీర్చేస్తే ఎవరూ ఎవరినీ ఏమీ అనరు కదా!