బ్యాంకులకు సుమారు 7 వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ చైర్మన్ విజయ్ మాల్యా దేశం నుంచి ఉడాయించాడు. ఈ ఉద్దేశ పూర్వక ఎగవేత దారు లండన్ చేరుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఆయన విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలంటూ బ్యాంకులు మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. బుధవారం మధ్యాహ్నం కోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. మాల్యాకు నోటీసు జారీ చేసింది. అయితే మాల్యా ఈనెల 2న దేశం విడిచిపోయాడని అటార్నీ జనరల్ కో్ర్టుకు తెలిపారు.
కింగ్ ఫిషర్ కంపెనీ దివాళా తీసి మూడేళ్లు దాటింది. అప్పటి నుంచీ అసలు కాదుగదా వడ్డీ కూడా పైసా కట్టడం లేదు. మరి ఇంత కాలం బ్యాంకులు ఏం చేసినట్టు? ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించి సీబీఐకి ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఊరుకున్నట్టు? ఇంత జరుగుతున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోలేదు? మాల్యా కంపెనీకి ఉదారంగా రుణాలు ఇచ్చిన వాటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువ. మరి, ఆ బ్యాంకులను హెచ్చరించి తగిన న్యాయపరమైన చర్యలు తీసుకునేలా కేంద్ర ఆర్థిక శాఖ ఎందుకు చొరవ చూపలేదు? గత కొన్ని రోజులుగా రోజూ మీడియాలో వస్తున్న ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి రాలేదా? ఆయనైనా ఆర్థిక మంత్రిని మందలించి, తగిన చర్యలు తీసుకునేలా పురమాయించకుండా ఎందుకు మిన్నకుండి పోయారు? ఈ ప్రశ్నల్లో దేనికీ జవాబు లేదు.
తనను తాను పేదల పెన్నిధిగా చెప్పుకునే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? మీడియాలో ఇంతగా హైలైట్ అయిన వార్త కూడా చూడలేనంత బిజీగా ఉన్నారా? 7 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రుణాల రూపంలో తీసుకుని, ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన వ్యక్తి గురించి రాహుల్ గాంధీ ఒక్క మాటైనా మాట్లాడక పోవడానికి మతలబు ఏమిటో అర్థం కాదు. ప్రతి చిన్న దానికీ కేంద్రంపై విరుచుకు పడే రాహుల్, ఇంత ఘరానా మోసంపై కిక్కురుమనడం లేదు. అంతటి బడా డిఫాల్టర్ ను ఒక్క మాట అనడానికి కూడా ఆయనకు నోరు రావడం లేదంటే ఏదైనా బలమైన కారణం ఉందా అనేది ఆయనే చెప్పాలి. కనీసం ప్రతిపక్షంగా ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీసి ఉంటే కాస్త కదలిక వచ్చేదేమో. ఆ డిఫాల్టర్ పారిపోక ముందే కట్టడి చేయడానికి ప్రయత్నం జరిగేదేమో.
బక్కరైతు పాలిక వేలు బాకీ ఉంటే కట్టే వరకూ పీల్చి పిప్పి చేస్తారు బ్యాంకుల అధికారులు. సామాన్యుడు పర్సనల్ లోన్ ఇన్ స్టాల్ మెంట్ రెండు మూడు వేలు కట్టడం ఆలస్యం చేస్తే పరువు తీసేలా వెంటపడతారు. అలాంటిది, వేల కోట్లు ఎగ్గొట్టిన డిఫాలర్టర్ ను డిఫాల్టర్ అనడానికి కూడా బ్యాంకులు భయపడ్డాయి. అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరీ ఔదార్యం ప్రదర్శించింది. మాల్యా తమకు ఆప్తుడనే విధంగా అతడు పారిపోయేలా అవకాశం ఇచ్చిన బ్యాంకుల్లో ఇదే లీడర్. తీరా విదేశాలకు చెక్కేసిన మాల్యాను వెనక్కి రప్పించడానికి ఈ బ్యాంకులు చిత్త శుద్ధితో న్యాయ పోరాటం చేస్తాయా అనేది అనుమానమే. దేశంలో ఉండగానే ఏమీ చేయలేకపోయారు. ఇక లండన్ నుంచి ఇండియాకు రప్పించాలంటే ముందు చిత్తశుద్ధి ఉండాలి. అది ఉందా అనేది ప్రశ్న. రెండోది చివరి వరకూ పోరాడే ఓపిక ఉండాలి. ఇదీ అనుమానమే. కాబట్టి మాల్యా రుణాలను రాని బాకీల కింద రాయాల్సిందేనా? ఇంత భారీ మొత్తం మోసగాడి పాల్జేసిన పాపం ఎవరిది? దీనికి బాధ్యులు ఎవరు? జవాబుదారీ ఎవరు? ఆర్థిక శాఖ కచ్చితంగా జవాబుదారీ తనాన్ని ఫిక్స్ చెయ్యాలి. బాధ్యులకు శిక్ష పడేలా చెయ్యాలి. కానీ అలా జరుగుతుందా అనేది మాత్రం అనుమానమే.