బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి..లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా.. బాకీ మొత్తం చెల్లించేస్తానని.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మొత్తంగా బ్యాంకులకు రూ.13,960 కోట్లు చెల్లిస్తానని ఆయన అంటున్నారు. మొత్తంగా సెటిల్మెంట్ ప్యాకేజీ కింద.. చెల్లించేందుకు సిద్ధమని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మాల్యా ఆఫర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2016లో దేశం విడిచి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా.. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ఈ మధ్యలో ఆయనను ఇండియాకు తీసుకొచ్చేందుకు అక్కడ కోర్టుల్లో భారత ప్రభుత్వం పోరాడింది. అంతా ఓకే అయ్యే సరికి.. బ్రిటన్ ప్రభుత్వం అడ్డుపుల్ల వేసింది. దాంతో ఆయనను ఇండియాకు తీసుకు రావడం అసాధ్యమని తేలిపోయింది.
ఈ లోపు బ్యాంకులు.. మాల్యాకు చెందిన ఆస్తులను వేలం వేయడం ప్రారంభించాయి. గోవాలో ఉన్న మాల్యా హౌస్‌ను.. అమ్మేశారు. అయితే.. ఇతర ఆస్తులను పెద్దగా కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో బ్యాంకులకు గిట్టుబాటు కాలేదు. ప్రస్తుతం ఆ ఆస్తులన్నీ.. ఈడీ అటాచ్‌లో ఉన్నాయి. అయితే.. విజయ్ మాల్యా.. లండన్ పారిపోయినప్పటి నుండి తాను డబ్బులు తిరిగి కడతాననే చెబుతూ వస్తున్నారు. అయితే.. బ్యాంకులకు తాను చెప్పినంత మొత్తంలో అప్పులేనని.. లెక్కలు చెప్పేవారు. తన ఆస్తులు పదిహేను వేల కోట్లు ఉంటాయని.. అప్పులు ఆరేడు వేల కోట్లు ఉంటాయని చెబుతూ ఉండేవారు. ఆయితే ఆయన మాటల్ని ఎవరూ లెక్క చేయలేదు.
ప్రస్తుతం విజయ్ మాల్యా… సుప్రీంకోర్టు ముందే ప్రతిపాదన పెట్టారు. న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో కానీ.. విజయ్ మాల్యాను మాత్రం నమ్మలేని.. ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ముందుగా తన ఆస్తులను అటాచ్మెంట్ నుంచి విడిపిస్తే.. వాటిని అమ్మేసి బాకీ తీరుస్తానని ఆయన అంటున్నారు. మామూలుగా అయితే.. ప్రస్తుతం ఆయన అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం.. ఆదాయం లేదని అంటున్నారు. ఆస్తులు అమ్మడానికి అవకాశం ఉంటే తప్ప.. విజయ్ మాల్యా.. సొమ్ములు తిరిగి కట్టే అవకాశం లేదన్న చర్చ కూడా నడుస్తోంది.