ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్.. ఇప్పుడు బ్యాడ్ టైమ్ ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా… కొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టాలన్న ఆలోచనే లేని తనను.. కుట్ర పూరితంగా బలవంతంగా… ఎగవేతదారుగా ముద్ర వేశారని ఆరోపించారు. బ్యాంకు లోన్ల కన్నా.. తనకు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ విషయంపై రెండేళ్ల కిందటే.. తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశానంటున్నారు. మోడీకి రాసినట్లు చెబుతున్న లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా. కానీ తనకే.. వారి దగ్గర్నుంచి ఎలాంటి స్పందనా రాలేదంటున్నారు. తను బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి పారిపోయినట్లుగా మీడియా, రాజకీయ నాయకులతో పాటు.. కొన్ని బ్యాంకులు కడా ఉద్దేశపూర్వకంగా… ప్రచారం చేశాయంటున్నారు. తాను డబ్బులు కడతానని పదే పదే చెబుతున్నా… ” విల్ ఫుల్ డిఫాల్టర్”గా ప్రకటించడానికి ఉత్సాహం చూపించాయంటున్నారు. తన గ్రూపు కంపెనీలు, సొంత కంపెనీలు, తన కుటుంబం కంట్రోల్లో ఉన్న కంపెనీల విలువ రూ. 13,900 కోట్ల వరకూ ఉందని.. ఇప్పటికీ… అవకాశం ఇస్తే బ్యాంకులతో సెటిల్మెంట్కు సిద్ధమేనంటున్నారు.
విజయ్ మాల్యా 2016 మార్చి మూడో తేదీన తనకు చెందిన ప్రత్యేక విమనంలో.. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లారు. అప్పటికే.. ఆయనపై వివాదాలు ముసురుకున్నారు. బ్యాంకులు కోర్టులకు వెళ్లాయి. చెప్పాపెట్టకుండా ఆయన వెళ్లిపోవడంతో.. పారిపోయారని.. మీడియాలో విస్త్రతంగా ప్రచారం జరిగింది. ఇలా ప్రచారం జరుగుతున్నప్పుడే.. అంటే… లండన్ వెళ్లిపోయిన వారం, పదిరోజులకే ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. అప్పటికి విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆ తర్వతా శరవేగంగా పరిమాణాలు మారిపోయాయి కారణం ఏదైనా.. అప్పటి వరకూ మాల్యా అంటే.. కుబేరునికి కేరాఫ్‌లా ఉండేవారు. ఇప్పుడు బ్యాంకలను ముంచిన వారికి బ్రాండ్ అంబాసిడర్లా మారారు.
విజయ్ మాల్యాను భారత్ రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మాల్యాకు ‘పారిపోయిన నేరస్థుడి’ ట్యాగ్ ఇవ్వాలని ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్రాన్ని కోరింది. ఆయన ఆస్తులు జప్తు చేయాలని ఈడీ కొద్ది రోజుల క్రితం ముంబయి కోర్టులో పిటిషన్ వేసింది. భారత్‌లో తనపై జరుగుతున్న విచారణపైనా.. మాల్యా స్పందించారు. తాను బ్యాంకులకు ఎగ్గొట్టిన రుణాలన్నీ సెటిల్ చేసుకుంటానంటున్నారు. మాల్యా ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. భారత్‌కు అప్పగింతపై అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది. త్వరలో తీర్పు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మాల్యా రుణాలను సెటిల్ చేసుకుంటానని ప్రకటనలు చేస్తున్నారు. తన వెనుక రాజకీయ కుట్ర జరిగిందనే ఆరోపణలు తెరమీదకు తెస్తున్నారు.