బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన… విజయ్ మాల్యా.. సంచలన విషయాన్ని బయటపెట్టారు. తాను లండన్‌కు పారిపోయే ముందు.. ఆర్థిక మంత్రి ఆరుణ్జైట్లీకి చెప్పానంటున్నారు. లండన్ కోర్టుకు హాజరైన విజయ్ మాల్యా.. ఈ విషయాన్ని స్పష్టంగా మీడియాకు చెప్పారు. కోర్టులోనూ చెప్పారు. ఆర్థిక మంత్రిని కలిసి, బ్యాంకులతో ఉన్న సమస్యను పరిష్కరించుకునేందుకు సెటిల్మెంట్ను కూడా ఆఫర్ చేసినట్టు మాల్యా ప్రకటించారు. “దేశం విడిచి రావడానికి కంటే ముందు పార్లమెంట్ ఆవరణలో జైట్లీని కలిశాను. లండన్ వెళ్తున్నట్టు చెప్పాను..” అని ప్రకటించేశారు. ఈ విషయం ఒక్కసారిగా హైలట్ అయింది. దీంతో విపక్షాలు.. కేంద్రంపై విమర్శలు ప్రారంభించాయి.
విజయ్ మాల్యా స్టేట్మెంట్పై అరుణ్ జైట్లీ స్పందించారు. ఆయనను కలవలేదని చెప్పుకొచ్చారు కానీ.. మాల్యా చెప్పినట్లుగా.. తమ మధ్య సంభాషణ జరిగినట్లు అంగీకరించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నదున.. పార్లమెంట్ ఆవరణలో తనతో మాట్లాడటానికి విజయ్ మాల్యా ప్రయత్నించారని… సెటిల్మెంట్కు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారన్నారు. కానీ బ్యాంకులతోనే మాట్లాడుకోమని.. సమాధానం ఇచ్చినట్లు జైట్లీ చెప్పుకొచ్చారు. ఆయన చేతులో ఉన్న పేపర్లు నాకు ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ వాటిని తీసుకోలేదని జైట్లీ చెప్పుకొచ్చారు. అయితే లండన్‌కు వెళ్లిపోతున్న విషయం చెప్పారా..? లేదా..? అన్న విషయాన్ని మాత్రం.. జైట్లీ బయటపెట్టలేదు.
దేశంలో బ్యాంకుల్లో పెరిగిపోయిన నిరర్థక ఆస్తులు. దేశం విడిచిపోతున్న ఆర్థిక నేరగాళ్ల వ్యవహారం కలకలం రేపుతున్న తరుణంలో మాల్యా ప్రకటన .. బీజేపీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. విపక్షాలు దీన్నో అస్త్రంగా మలుచుకున్నాయి. నీరవ్‌మోదీ, మెహుల్చౌక్సిలు కూడా శిక్షల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వ అనుమతితోనే దేశం విడిచి పారిపోయారని కాంగ్రెస్ ఆరోపించింది. నిరవ్ మోదీ ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసుకోలేనంత అసమర్థత భారత ప్రభుత్వానిదా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి కేంద్రం తప్పించుకోలేని విధంగా.. విజయ్ మాల్యా.. గట్టి దెబ్బే కొట్టారు.