భారత్ లో కొన్ని బ్యాంకులకు రూ. 9,000 కోట్లకు కుచ్చు టోపీ పెట్టేసి లండన్ పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకి బ్యాంకులు నోటీసులు జారీ చేసి రెండు వారాలలోగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ కూడా ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి మార్చి 18న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసు పంపింది. దానికి విజయ్ మాల్యా పంపిన సమాధానంలో తను ఇప్పటికిప్పుడు భారత్ రాలేనని, ఒక నెల రోజులు గడువు కావాలని కోరారు. అందుకు ఆయన ఏమి కారణాలు చెప్పారో ఈడి అధికారులు వెల్లడించలేదు కానీ వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ఆయన రానని అంత ఖరాఖండిగా చేపుతునప్పుడు ఈడి మాత్రం అంతకంటే చేయగలిగిందేమీ లేదు కనుక ఆయనకి అప్పులిచ్చిన బ్యాంకులతో బాటు ఆయన రాక కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూడక తప్పదు.
విజయ్ మాల్యా లండన్ పారిపోయిన తరువాత “నేనేమి దేశం విడిచి పారిపోలేదు. నేనొక అంతర్జాతీయ వ్యాపారవేత్తను కనుక నా వ్యాపార పనుల మీద దేశ,విదేశాలలో నిత్యం తిరుగుతుంటాను. నాకు భారత్ న్యాయవ్యవస్థపై చాలా గౌరవం ఉంది. నేను భారత చట్టాలకి లోబడి ఉంటాను. కానీ ప్రస్తుతం భారత్ మీడియా నా గురించి చాలా దుష్ప్రచారం చేస్తోంది కనుక దేశంలో నా పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉన్న కారణంగా నేను ఇప్పుడు భారత్ రాదలచుకోలేదు,” అని తన ట్వీటర్ లో మెసేజ్ లు పెట్టారు.
పెద్దల సభ (రాజ్యసభ) సభ్యుడు కూడా అయిన విజయ్ మాల్యా తనకు భారత చట్టాలు, న్యాయవ్యవస్థల పట్ల నమ్మకం, గౌరవం ఉందని చెపుతూనే, మళ్ళీ అదే నోటితో వాటి ఆదేశాలను తను పాటించలేనని చెపుతున్నారు. అయినా ప్రభుత్వం ఆయనని ఏమీ చేయలేకపోవడం సిగ్గుచేటు. పార్లమెంటు, పఠాన్ కోట్ పై జరిగిన దాడులు భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేసినట్లుగా ఏవిధంగా భావింస్తున్నామో, విజయ్ మాల్యా భారత న్యాయవ్యవస్థలను, చట్టాలను ధిక్కరించడాన్ని కూడా అదే విధంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పాక్ దాడులు ఉగ్రవాదమయితే, విజయ్ మాల్యా చేసింది ఆర్ధిక ఉగ్రవాదం.పాక్ ఉగ్రవాదుల దాడిలో నష్టం ప్రత్యక్షంగా కళ్ళకి కనిపిస్తుంది విజయ్ మాల్యా చేసిన నష్టం కళ్ళకి కనిపించదు అంతే తేడా!