తమిళనాట డీఎంకేకు బలమైన ప్రత్యర్థిగా తానే ఉంటానని తమిళ స్టార్ హీరో విజయ్ గట్టి సంకేతం పంపించారు. తమిళగ వెట్రి కళగం … టీవీకే పేరుతో ఆయన పెట్టిన పార్టీ తొలి ప్లీనరీని ఇతర సంప్రదాయ పార్టీలతో సమానంగా ఘనంగా నిర్వహించారు. అక్కడ తన భావజాలాన్ని కూడా ఆవిష్కరించారు. అదేమీ కొత్తగా లేదు. డీఎంకే, అన్నాడీఎంకే పాటిస్తున్నవే. అవినీతి పేరుతో పాలకపక్షంగా ఉంది కాబట్టి డీఎంకేను టార్గెట్ చేశారు. ఇప్పుడు డీఎంకేతో పోటీ పడితేనే ప్రత్యర్థిగా గుర్తింపు వస్తుంది.
పవన్ కల్యాణ్ రాజకీయ ఆదర్శాలు ఎలా ఉండేవో విజయ్ ఆదర్శాలు కూడా అలాగే ఉన్నాయి. రాజకీయ అడుగులు కూడా అలాగే వేస్తున్నారు. అవసరమైతే పొత్తులకు సిద్ధమని ప్రకటించారు. ఆయన తన రాజకీయ పయనాన్ని, ప్రజల స్పందనను అంచనా వేసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విజయ్ కు సొంత ఓటు బ్యాంకు ఏర్పడటం చాలా కీలకం. సరైన నాయకుడు లేక అన్నాడీఎంకే బలహీనంగా ఉంది. ఇప్పుడు అన్నాడీఎంకే క్యాడర్ విజయ్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే విజయ్ తన భావజాలంతో వారిని తనవైపు లాక్కోవాల్సి ఉంది.
తమిళనాడులో ఏక పార్టీ విజయం దాదాపుగా అసాధ్యం. కూటముులుగా పోటీచే సి విజయం సాధిస్తూంటాయి. డీఎంకే కూడా కూటమిగానే గెలిచింది. విజయ్ కూడా రాజకీయంగా ఓ ఆప్షన్ ఉంచుకుందామన్న ఆలోచనతోనే ఆయన పొత్తులపై ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. ఆయన పొత్తు పెట్టుకోగలగిన పార్టీ అన్నాడీఎంకే మాత్రమే. బీజేపీతో సైద్ధాంతికంగా సరిపడదు. డీఎంకేపైనే యుద్ధం ప్రకటించారు కాబట్టి ఆ పార్టీతో చేరరు. మొత్తంగా పవన్ కల్యాణ్ తరహాలోనే విజయ్ రాజకీయ ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పటికీ ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఫుల్ టైమ్ రాజకీయాలపై దృష్టి పెట్టకపోతే ప్రజలు కూడా సీరియస్గా తీసుకోకపోవచ్చు.